నంద్యాల జిల్లా: శ్రీశైలం వైయస్ఆర్‌సీపీ గ్రామ నాయకుడు పుల్లయ్యపై రాడ్లు, కత్తులతో దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. టీడీపీలో చేరేందుకు నిరాకరించినందుకే పుల్లయ్యను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. టీడీపీలో చేరగానే వ్యక్తుల గత చరిత్ర మారిపోతుందా అని శిల్పా ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీలో రౌడీగా ఉన్న వ్యక్తి టీడీపీలో చేరగానే నీతిమంతుడిగా మారిపోతాడా అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని నిలదీశారు. టీడీపీలోని పలువురు నాయకులు తనతో టచ్‌లో ఉన్నారని శిల్పా తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైయస్ఆర్‌సీపీలో చేరడం ఖాయమని అన్నారు. పార్టీ మార్పుల కోసం బెదిరింపులు, దాడులకు పాల్పడే రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.