పోలీసులు, ఎన్నికల యంత్రాంగం అండతో కూటమి అరాచకాలు

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ

వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు ఫైర్ 

కూట‌మి నాయ‌కుల‌ ఎన్నిక‌ల అక్ర‌మాల‌పై జిల్లా ఎస్పీని క‌లిసి ఫిర్యాదు చేసిన అనంత‌రం అక్క‌డే మీడియాతో 
మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నాయ‌కులు 

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు

నామినేషన్ల అడ్డగింత, రిగ్గింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఫలితాల తారుమారు

తాడిపత్రిలో పెట్రోల్ బాంబుల దాడులు.. బాధితులపైనే నాన్ బెయిలబుల్ కేసులు

శింగనమలలో మహిళలు, పిల్లలపై దాడులు.. సమయానికి ముందే ఎన్నిక ముగింపు

కళ్యాణదుర్గంలో డీఎస్పీ సమక్షంలోనే 38 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ ఫలితాల మార్పు

గుంతకల్లులో ఏకగ్రీవాల పేరుతో రూ. లక్షల్లో ప్రలోభాలు, గంజాయి బ్యాచ్‌లతో బెదిరింపులు

అనంత‌పురం:  అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో అధికార కూటమి నాయకులు.., పోలీసు, ఎన్నికల యంత్రాంగం అండతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైయ‌స్సార్‌సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, సాకె శైలజానాథ్, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తలారి రంగయ్య, వై. వెంకట్రామిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నిక‌ల అక్ర‌మాల‌పై ఫిర్యాదు చేయ‌డంతోపాటు రాబోయే పంచాయ‌తీ ఎన్నికలు ప్ర‌శాంతంగా నిర్వ‌హించాల‌ని ఎస్పీని క‌లిసిన అనంత‌రం వారు అక్క‌డే మీడియాతో మాట్లాడారు. నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకోవడం, రిగ్గింగ్ చేయడం, కౌంటింగ్ కేంద్రాల్లో డీఎస్పీ, సీఐల సమక్షంలోనే గెలిచిన వారిని ఓడినట్లు ప్రకటించి ఫలితాలను తారుమారు చేయడం వంటి అక్రమాలు జిల్లావ్యాప్తంగా జరుగుతున్నాయని వారు ఆరోపించారు. తాడిపత్రిలో పట్టపగలే పెట్రోల్ బాంబులతో దాడులు చేసి వాహనాలు, ఇళ్లను తగలబెట్టినా పోలీసులు పట్టించుకోకపోగా, బాధితులపైనే అక్రమ కేసులు, హౌస్ అరెస్టులు విధిస్తున్నారని మండిపడ్డారు. శింగనమల ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా మహిళలు, పిల్లలపై దాడులు చేయడమే కాకుండా, మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన ఎన్నికను 1.20 గంటలకే ముగించి అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. కళ్యాణదుర్గంలో ప్రైవేట్ బౌన్సర్ల సాయంతో, గుంతకల్లులో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల ప్రలోభాలు, గంజాయి బ్యాచ్‌ల బెదిరింపులతో ఎన్నికలను వ్యాపారంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని, ఎన్నికల అక్రమాలను బయటపెట్టకుండా మీడియాను అడ్డుకోవడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని స్పష్టం చేశారు. వ్యవస్థలన్నీ పూర్తిగా విఫలమయ్యాయని, అందువల్ల పోలింగ్ నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రజలే స్వయంగా కేంద్రాల వద్ద కాపలా ఉండి తమ ఓటు హక్కును రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి జరగబోయే సర్పంచ్ ఎన్నికలనైనా నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలిసి డిమాండ్ చేశారు.

నాయ‌కులు ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే... 

పోలీసులు, ఎన్నికల యంత్రాంగం అండ‌తో ప్రజాస్వామ్యం ఖూనీ 
- అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం జిల్లా వైయ‌స్సార్‌సీపీ అధ్యక్షుడు

అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు ఒక పక్షానికి వత్తాసు పలుకుతున్నారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నుంచి ప్రస్తుత సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, రిగ్గింగ్‌కు పాల్పడటం, పోలింగ్ బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకోవడం వంటి అక్రమాలు జరుగుతున్నాయి. కౌంటింగ్‌లోనూ గెలిచిన వారిని ఓడినట్లు, ఓడిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తూ ఫలితాలను తారుమారు చేస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం, శింగనమల, తాడిపత్రిలో పోలీసుల వ్యవహారశైలి వల్ల పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. తాడిపత్రిలో పెట్రోల్ బాంబులతో వాహనాలు, ఇళ్లపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు, బాధితులకే రక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీ నాయకులపై హౌస్ అరెస్టులు, నియోజకవర్గ బహిష్కరణలు విధిస్తూ దాడులకు పాల్పడుతున్న కూటమి నాయకులపై చర్యలు తీసుకోవడం లేదు. ఈ నెల 26 నుంచి జరిగే సర్పంచ్ ఎన్నికలనైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి. పోలీసుల ఏకపక్ష వైఖరికి అడ్డుకట్ట వేసి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మహిళలు, పిల్లలపై దాడులు.. పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం
- సాకె శైలజానాథ్, మాజీ మంత్రి

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో కూటమి నాయకులు దుర్మార్గపు, దౌర్జన్యపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి పంచాయతీలు చేయడం, కొట్టడం, కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. శింగనమల ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా మహిళలు, పిల్లలను కొట్టారు, పోలీసులే వారిని నెట్టివేశారు. ఎన్నికల అధికారులు కూడా ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన ఎన్నికను 1.20 గంటలకే ముగించేశారు. ఇళ్లపై దాడులు చేయడం, వాహనాలను తగలబెట్టడం, ఇళ్లను ధ్వంసం చేయడం ఏమిటి? రాజేపల్లిలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులను, వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు, లేఖలు పంపినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శోధనపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచామని టీడీపీ నాయకులే బహిరంగంగా చెప్పుకున్నారు. ఇది పూర్తిగా వ్యవస్థ వైఫల్యం. ఇప్పటికైనా పోలీసులు బాధ్యతగా వ్యవహరించి అకృత్యాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలి. ప్రజల సహనాన్ని పరీక్షించవద్దు.

పెట్రోల్ బాంబులతో దాడులు.. కౌంటింగ్ కేంద్రాల్లో ఫలితాల తారుమారు
- కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

అధికారంలో ఉన్నవారికి చట్టం చుట్టంగా మారింది, ప్రజాస్వామ్యం అపహాస్యంగా నిలిచిపోయింది. తాడిపత్రిలో గత రెండున్నరేళ్లుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు తెచ్చుకున్నా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి కల్పించారు. మొన్నటి ఎన్నికల్లో ఏజెంట్లను, అభ్యర్థులను బయటకు పంపించి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రజాతీర్పును ఎదుర్కొనే ధైర్యం కూటమి నాయకులకు లేదు. పట్టపగలే పెట్రోల్ బాంబులతో దాడులు చేసి నాలుగు వాహనాలు, 15 ద్విచక్ర వాహనాలను తగలబెట్టారు, ఇళ్లపైకి వచ్చి దాడులు చేశారు. ఇలాంటి ఘటనల్లో బాధితులపైనే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. శింగనమలలోనూ ఎన్నికల ప్రక్రియను అడ్డుకుని, కౌంటింగ్ కేంద్రాల్లో ఫలితాలను మార్చారు. 11 ఎంపీటీసీ, ఎనిమిది కౌన్సిలర్ స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశారు. 16 చోట్ల రీకౌంటింగ్ కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు, బదిలీల పేరుతో ఒత్తిళ్లు తీసుకొస్తూ అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు పనిచేయించుకుంటున్నారు. పెట్రోల్ బాంబులతో దాడులు జరిగినా టపాసుల వల్ల మంటలు అంటుకున్నాయని చెప్పడం పోలీసుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వైఎస్సార్‌సీపీ నాయకులకే హౌస్ అరెస్టులు, ఆంక్షలు విధిస్తూ కూటమి నాయకులకు స్వేచ్ఛనిస్తున్నారు. పోలీసు వ్యవస్థ సహకారంతోనే ఈ అరాచకాలు జరుగుతున్నాయని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికైనా స్పందించి ఎన్నికల హింసను అరికట్టాలి, లేదంటే ఏదో ఒక రోజు ప్రజలే స్పందించే పరిస్థితి వస్తుంది.

కళ్యాణదుర్గంలో డీఎస్పీ స‌మ‌క్షంలోనే ఫలితాల తారుమారు
- తలారి రంగయ్య, మాజీ ఎంపీ

పోలీసు, ఎన్నికల వ్యవస్థలు పూర్తిగా విఫలమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ముందునుంచే పోలీసుల నుంచి ప్రజలను రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల అధికారుల నుంచే ఎన్నికలను కాపాడాలని గతంలోనూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కళ్యాణదుర్గంలో నామినేషన్ల సమయంలో అభ్యర్థులను అడ్డుకోవడం, రిగ్గింగ్‌కు పాల్పడటం వంటి అక్రమాలు జరిగాయి. కౌంటింగ్ కేంద్రాల్లోనే ఫలితాలను మార్చేయడం అత్యంత దారుణం. కళ్యాణదుర్గంలో నాలుగు జెడ్పీటీసీ, దాదాపు 38 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను డీఎస్పీ, సీఐల సమక్షంలోనే తారుమారు చేశారు. వ్యవస్థలు విఫలమైతే ప్రజలకు పోలీసు, ఎన్నికల, ఇతర ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పోతుంది. కనీసం ఈసారైనా సర్పంచ్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. ఎలాంటి గొడవల్లో సంబంధం లేని వారిని కేసుల్లో ఏ1, ఏ2 నిందితులుగా చేర్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజలు వేసిన ఓట్లను పోలింగ్ నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల అధికారులు, పోలీసులపై నమ్మకం లేకుండా ప్రజలే పోలింగ్ కేంద్రాల వద్ద ఉండి తమ ఓట్లను రక్షించుకోవాల్సి వస్తోంది. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

ఎన్నికలను వ్యాపారంగా మార్చిన కూటమి నేతలు
- వై. వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు హింస, బెదిరింపులు, అక్రమాలకు పాల్పడుతున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తిలో అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వారి భార్యలు, పిల్లలను సైతం బెదిరించే స్థాయికి దిగజారారు. కష్టపడి దాఖలు చేసిన 19 నామినేషన్లలో 12 తిరస్కరించారు, మిగిలిన ఏడుగురిని కూడా రాత్రివేళ బెదిరించి ముగ్గురిని మాత్రమే పోటీలో ఉంచారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అధికారులే నామినేషన్ పత్రాలను చించివేసే పరిస్థితి చూశాం. కోర్టు ఆదేశాలు తెచ్చుకున్నా వైయ‌స్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే తనయుడి పేరుతో ఏకగ్రీవ ఎన్నికలకు ప్రలోభాలు పెడుతూ గ్రామాలకు రూ.20 లక్షలు, రూ.30 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. పామిడి పట్టణంలో సర్పంచ్ నామినేషన్లు వేయగలిగినా వార్డు సభ్యుల నామినేషన్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అభ్యర్థులను బాంబులతో బెదిరిస్తూ గంజాయి బ్యాచ్‌లతో దాడులు చేయిస్తున్నారు. ఎన్నికల్లో ప్రతిఘటించే వారిపైనే కేసులు నమోదు చేసి భయపెడుతున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఎన్నికల పేరుతో రూ.15 నుంచి రూ.16 కోట్ల వరకు వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలపై ఎస్పీ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల అక్రమాలను చిత్రీకరించకుండా మీడియాను అడ్డుకోవడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. కనీసం రాబోయే ఎన్నికలైనా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

Back to Top