తాడేపల్లి: దేవాదాయ శాఖ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన రూ. 7 కోట్ల కుంభకోణంలో అసలు సూత్రధారులను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితులైన కోట రుక్మిణి, కేకే శ్రీనివాస్‌లను ఈ కేసు నుంచి తప్పించేందుకు, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ధరణి కృష్ణ అనే మహిళను బలిపశువుగా మార్చి పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 2025 నుంచే ప్రభుత్వ ఎంబ్లమ్, ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన ఈ వ్యవహారంలో వసూలైన కోట్లాది రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయో తేలాలంటే తక్షణమే సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. అసలు సూత్రధారులను కాపాడేందుకే కేసు మూసివేత యత్నాలు.. ఈ కుంభకోణంలో జనసేన పార్టీ కీలక నేతలను కాపాడేందుకే పోలీసు, దేవాదాయ శాఖ అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ వ్యవహారంలో జనసేనకు సంబంధం లేదని, కేసు కొలిక్కి వచ్చిందని సీఐడీ ఏఎస్పీ సీతారాములు ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర ఉంది. మరోవైపు, తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని, బాధితులెవరూ తమ దృష్టికి రాలేదని దేవాదాయ శాఖ కమిషనర్ సీబీసీఐడీకి లేఖ రాయడం విడ్డూరంగా ఉంది. రుక్మిణి కోట రహస్యం అనే కరప్టెడ్ వెబ్ సిరీస్‌లో భాగంగా దేవాదాయ శాఖలో జరుగుతున్న టెంపుల్ రన్ లాంటి అవినీతి బండారం ఇప్పుడు బయటపడింది. నిరుద్యోగ యువత దగ్గర రూ. 7 కోట్లు వసూలు చేసిన కుంభకోణాన్ని బయటపెడితే, వాస్తవాలు చెప్పకుండా సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగుతున్నారు. అధికారిక వెబ్సైట్లో ఫేక్ ఉద్యోగి పేరు ఎలా వచ్చింది?.. చెల్లి అప్పారావు అనే వ్యక్తికి దేవాదాయ శాఖలో గ్రేడ్-3 ఉద్యోగాన్ని అమ్మి, అసిస్టెంట్ కమిషనర్ సంతకంతో నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చారు. నకిలీ ఆఫర్ లెటర్‌తో పాటు అభ్యర్థి వేలిముద్రలు తీసుకుని సర్వీస్ బుక్ కూడా తయారు చేసి ఉన్నతాధికారుల డిజిటల్ సిగ్నేచర్లను ఫోర్జరీ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ 'ఏపీ టెంపుల్స్' డేటాబేస్‌లో గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎలా దర్శనమిచ్చింది? కేవలం నకిలీ పత్రాలే కాకుండా, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ (aptemples.ap.gov.in) డేటాబేస్‌లోనూ సదరు వ్యక్తి పేరు ఉద్యోగిగా ఎలా నమోదైంది?. ప్రభుత్వ పెద్దల అండ లేకుండా కేవలం రూ. 30 వేల జీతానికి పనిచేసే ధరణి కృష్ణ ఒక్కతే ఉన్నతాధికారుల డిజిటల్ సిగ్నేచర్లను ఫోర్జరీ చేసి ప్రభుత్వ వెబ్‌సైట్‌ను మార్చగలదా?. దొంగల ముఠాలో అసలైన సూత్రధారులను కాపాడేందుకు దిగువ మధ్యతరగతి మహిళ అయిన ధరణి కృష్ణను బలిపశువును చేస్తున్నారు. బాధితురాలిని నిందితురాలిగా మార్చి పోలీసుల అమానుష దాడి.. కోట రుక్మిణి, కేకే శ్రీనివాస్‌లే తిరిగి ఫిర్యాదుదారులుగా అవతారమెత్తి ఫిర్యాదుదారులగా అవతారమెత్తి.. ధరణి కృష్ణపై తప్పుడు కేసులను పెట్టి.. నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 13న మంగళగిరి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని మూడు రోజుల పాటు అదృశ్యం చేసి, బెల్టులతో విచక్షణారహితంగా కొట్టారు. ఇందుకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎంఎల్సీ (MLC) రిపోర్టే నిదర్శనం. ఆసుపత్రి ఇంటిమేషన్ సర్టిఫికెట్తో పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు తీసుకోకుండా బయటకు పంపించేశారని, తన ప్రాణానికి ప్రమాదం ఉందని, పవన్ కళ్యాణ్ గల్లాపెట్టె తాళాలు తనకు, రుక్మిణికి మాత్రమే తెలుసని ఆమే స్వయంగా సెల్ఫీ వీడియోలో చెప్పినా పోలీసులు ఎందుకు విచారించడం లేదు?. కైరాన్ సంస్థ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి.. ఈ కేసులో జనసేనకు సంబంధం లేదని సీఐడీ ఏఎస్పీ ప్రకటిస్తే, అసలు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ రాయడం విడ్డూరం. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన రూ. 7 కోట్లు ఎవరి ఖాతాల్లో జమయ్యాయి? ఆ 36 మంది బాధితుల వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు?. కోట రుక్మిణికి చెందిన కైరాన్ కన్సల్టెంట్ సర్వీసెస్ సంస్థ మంగళగిరి, లండన్ బ్యాంక్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి. రూ. లక్ష పెట్టుబడితో సంస్థ పెట్టిన రుక్మిణి కోట, తనపై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసులు పంపడం హాస్యాస్పదం. ఈ నేపధ్యంలో కోట రుక్మిణికి నిజంగా నిజాయితీ ఉంటే పరువు నష్టం నోటీసులతో కాలయాపన చేయకుండా, ఈడీ లేదా సీబీఐ విచారణకు సిద్ధమని కేంద్రానికి, రాష్ట్రానికి లేఖ రాయాలని నాగార్జున యాదవ్ సవాల్ విసిరారు. ప్రభుత్వం వచ్చాక నాపై 18 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలేదని.. మీ తాటాకు చప్పుళ్లకు, నక్క జిత్తులకు భయపడే ప్రసక్తే లేదని, తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగినా నిరుద్యోగ యువత పక్షాన న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.