నామినేషన్ల అడ్డగింత, దాడులతో ప్రజాస్వామ్యానికి తూట్లు

స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో ప‌రాకాష్ట‌కు చేరిన‌ కూట‌మి దాష్టీకాలు  

 వైఎస్సార్‌సీపీ నాయ‌కుల ధ్వ‌జం 

కూట‌మి నాయ‌కుల ఎన్నిక‌ల అక్ర‌మాల‌పై ఎస్ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన‌ అనంత‌రం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నాయ‌కులు 

 స్క్రూటినీలో అకార‌ణంగా వైఎస్సార్‌సీపీ సానుభూతి ప‌రుల నామినేషన్ల తిరస్కరణ

 ఓటమి భయంతోనే పోటీకి దూరం చేసే కుట్ర

 పులివెందుల, పిడుగురాళ్ల, చంద్రగిరిలో అభ్యర్థుల అడ్డగింత.. హౌస్ అరెస్టులు

 పచ్చ చొక్కాల మూకలకు పోలీసుల అండ.. అధికారుల ఏకపక్ష వైఖరి 

 ఓటు వేయకుండానే ఏకగ్రీవాల యత్నం.. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేకే ఈ అరాచకాలు 

 ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు శూన్యం.. ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఎస్ఈసీ 

 పంచాయ‌తీ ఎన్నిక‌లు నిష్ప‌క్ష‌పాతంగా నిర్వ‌హించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్

 విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన కూటమి ప్రభుత్వం పోలీసుల అండతో అరాచకాలు చేస్తోంద‌ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసిన నామినేషన్లను సాకులు చూపి తిరస్కరించడం, నాయకులను హౌస్ అరెస్టులు చేయడం వంటి కుట్రలకు కూటమి నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పలు ప్రాంతాల్లో నామినేషన్ కేంద్రాల వద్ద వందలాది మందిని సమీకరించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై పెట్రోల్ బాంబులు, రాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అక్రమాలపై ప్రతిరోజూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు రావడం లేదని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. పోలీసు, రెవెన్యూ, ఎన్నికల అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రాజ్యాంగం కల్పించిన పోటీ హక్కును కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రజల ఓటుతో గెలవాల్సిందిపోయి కూట‌మి నాయ‌కులు బెదిరింపులు, ప్రలోభాలతో ఏకగ్రీవాలు సాధించుకోవాలని చూడటం వారి ప్రజా వ్యతిరేక పాలనకు, ఓటమి భయానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం తన స్వతంత్ర ప్రతిపత్తిని నిరూపించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసే హక్కు కల్పించి దివ్యాంగులు సహా ఓటర్లందరికీ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు.

ఎస్ఈసీని క‌లిసిన వారిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (రైతు విభాగం) ఎంవీఎస్ నాగిరెడ్డి, 

నాయ‌కులు ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే... 

 నామినేషన్ వేసే రాజ్యాంగబద్ధమైన హక్కుకే ముప్పు
- ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (రైతు విభాగం)

కమిషనర్ తమ ముందు స్పందించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అభ్యర్థుల నామినేషన్లు వేయడం అనే అంతిమ ఫలితం మాత్రం జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. 15, 16 పంచాయతీల చొప్పున స్క్రూటినీలో చిన్నచిన్న వంకలతో నామినేషన్లను రిజెక్ట్ చేస్తున్నారని, గ్రౌండ్ లెవెల్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు వేల సంఖ్యలో ఏకగ్రీవం అయ్యాయని చెబుతున్నప్పటికీ, ప్రజాస్వామ్యంలో అభ్యర్థులు నామినేషన్ వేసే రాజ్యాంగబద్ధమైన హక్కుకే ముప్పు వాటిల్లిందని అన్నారు. తమ బృందం ప్రతిరోజూ 25 నుంచి 35 వరకు నిర్దిష్ట ఉదాహరణలతో ఫిర్యాదులు అందిస్తున్నప్పటికీ, ఆ ప్రక్రియ అక్కడే ఆగిపోతోందని తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారాలు ఉన్నందున, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నామినేషన్లు సజావుగా దాఖలయ్యేలా చూడాలని కోరారు. ప్రజలు ఇచ్చే తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని, ఎవరు గెలిస్తే వారు గెలిచేలా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

---

 మూక దాడులతో భయపెడుతూ రౌడీయిజం
- రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ

మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే, అభ్యర్థులు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటుండగా హౌస్ అరెస్టులు మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాపేట, తొండూరు మండలాల్లో నామినేషన్, స్క్రూటినీ ప్రక్రియలకు తమ వారిని నామినేషన్ సెంటర్లలోకి కూడా అనుమతించడం లేదని చెప్పారు. సుమారు 700 నుంచి 800 మంది గుమిగూడి దాడులు, పెట్రోల్ బాంబులు, కర్రలు, రాళ్లతో వెనక్కి పంపుతుంటే, పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్న మూకలకు కాపు కాస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిజంగా మంచి చేసి ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరిపి ప్రజల్లోకి వెళ్లాలని, ఓటు వేయకుండానే ఏకగ్రీవం చేసుకుంటే ప్రజలను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు. ప్రజల దగ్గరకు వెళ్లే ధైర్యం లేకే దాడులు, అక్రమ కేసులు, హౌస్ అరెస్టులతో భయపెట్టే రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. ఎన్ని దాడులు చేసినా వెనకడుగు వేయబోమని, ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

---

ఫిర్యాదులు ఇస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు
- నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు

నెల రోజులుగా ఎన్నికల సమరం మొదలైనప్పటి నుంచి రోజుకు ఒకటి నుంచి మూడు సార్లు ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదులు ఇస్తున్నా పరిస్థితి మారలేదని ఆయన తెలిపారు. పోలీసుల్లో, అడ్డుకుంటున్న వారిలో, నామినేషన్లు తీసుకునే అధికారుల్లో, అలాగే ఎన్నికల కమిషన్ వైఖరిలోనూ ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడప, తిరుపతి, పల్నాడు జిల్లాలలో కొన్నిచోట్ల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్తుంటే, పిడుగురాళ్ల వద్ద ఒక ఎస్ఐ తలుపులు మూసి అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఫిర్యాదులు ఇచ్చినప్పుడు కమిషన్ డీజీపీకి ఫార్వర్డ్ చేయడం వరకే పరిమితమవుతోందని, ఒకరిద్దరిపై సస్పెన్షన్ లేదా చర్యలు తీసుకుంటేనే భయం ఉంటుందని పేర్కొన్నారు. ఒకవైపు నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంటే, మరోవైపు చంద్రగిరి మండలంలో స్క్రూటినీలో వంకలు పెట్టి చెల్లకుండా చేస్తున్నారని తెలిపారు. అవసరమైతే మళ్లీ వచ్చి కమిషన్ తలుపులు తడతామని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా ఎన్నికల కమిషన్ కాపాడాలని డిమాండ్ చేశారు.

---

ప్రజా తీర్పుతో ప్రభుత్వ పతనం తప్పదు
- కొమ్మూరి కనకారావు, పార్టీ ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్

మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలవగానే అరాచకం మొదలైందని, రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలపై ఎస్ఈసీని కలిశామని ఆయన చెప్పారు. తమ ముందు పోలు చేస్తున్నారని, కింద ఎస్పీలు, కలెక్టర్లు పనిచేయడం లేదని కమిషన్ అనడాన్ని బట్టి అది పరోక్షంగా ప్రభుత్వ కబంధహస్తంలోకి వెళ్లిందని అర్థమవుతోందని అన్నారు. నిన్నటితో రెండో విడత నామినేషన్లు ముగియగానే, ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాస్మీర్‌లను హౌస్ అరెస్టు చేశారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మంచి వ్యక్తిని ఎన్నుకునే గ్రామ స్వరాజ్య స్ఫూర్తిని, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజల మద్దతు దొరకదనే భయంతోనే నామినేషన్ దశలోనే అడ్డుకుంటున్నారని, ఇది ప్రభుత్వ పతనానికి నాంది అని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో ఇచ్చే తీర్పుతో పతనం తప్పదని, కమిషన్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
---

 ఓట‌మి భయంతోనే నామినేషన్ల అడ్డగింత
- బందెల కిరణ్ రాజ్, పార్టీ దివ్యాంగుల విభాగం మాజీ అధ్యక్షుడు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తీసుకున్న నిర్ణయాలు అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అపహాస్యం చేసేలా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయని ఆయన అన్నారు. వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని, యంత్రాంగాన్ని చేతిలో ఉంచుకుని నామినేషన్ ప్రక్రియను అడ్డుకోవడం ఓటమి భయంతో తీసుకున్న నిర్ణయమేనని తెలిపారు. పార్టీ ప్రతినిధులు నిత్యం ఎస్ఈసీని కలిసి వినతులు ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రజలు తమకు కావలసిన నాయకుడిని ఎన్నుకునే పద్ధతి లేకుండా ఏకగ్రీవాలు చేసుకుంటే, ప్రజల అవసరాల కోసం ఎవరిని అడగాలని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై నియంతృత్వ ధోరణిని మానుకోవాలని, రాబోయే రోజుల్లో ప్రజలే దీనికి పరిష్కారం చూపిస్తారని స్పష్టం చేశారు. ఇచ్చిన ఫిర్యాదులను సరిదిద్దడంతో పాటు, ఇటీవలి ఎన్నికల్లో దివ్యాంగులకు వీల్‌చైర్లు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్న కమిషన్ రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనైనా ఆ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Back to Top