అమరావతి: బెంగళూరులోని యలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు దేవనహళ్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు షాక్ ఇచ్చింది. వివాదాస్పద ఆస్తిలోకి ప్రవేశించవద్దని, ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని షర్మిలతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, ఏజెంట్లు, ప్రతినిధులను ఆదేశిస్తూ మధ్యంతర నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఆస్తికి ఎలాంటి నష్టం కలిగించరాదని స్పష్టం చేసింది. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన దావాలో లీజు ఒప్పందం, అద్దె చెల్లింపులు, ఇతర పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం.. సంస్థ వాదనలకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. షర్మిలకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. అభ్యంతరాలు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. తాత్కాలికంగా అనుమతిస్తే.. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు... గతంలో షర్మిలకు గెస్ట్‌హౌస్‌లో తాత్కాలికంగా ఉండేందుకు అనుమతి ఇచ్చామని, ఇప్పుడు ఆమె, ఆమె తరఫు వ్యక్తులు వచ్చి ఆ ఆస్తి స్వాదీనానికి ప్రయత్నిస్తున్నారని, అలాగే తమకు ఆటంకాలు కలిగిస్తున్నారంటూ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన భీమిశెట్టి రమేష్ బాబు దేవనహళ్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా దాఖలు చేశారు. ఈ ఆస్తి విషయంలో షర్మిల గానీ, ఆమె తరఫు వ్యక్తులెవ్వరూ కూడా జోక్యం చేసుకోకుండా శాశ్వత నిషేధాజ్ఞలు ఇవ్వాలని కోరారు. రమేష్ బాబు తరఫు న్యాయవాది సుదీర్ మేడమయ్య వాదనలు వినిపించారు. 2007 మార్చి 1 నుంచి ఆ ఆస్తి సిలికాన్ బిల్డర్స్ లీజులో ఉందని ఆయన వివరించారు. అందుకు సంబంధించిన ఒప్పందాన్ని పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. అయితే ఈ ఆస్తి తనదేనంటూ షర్మిల బహిరంగంగా ప్రకటనలు చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించి షర్మిల సామాజిక మాధ్యమాల్లో చేసిన ట్వీట్‌ను కోర్టుకు సమర్పించారు. షర్మిల చేస్తున్న యాజమాన్య హక్కుల ప్రకటనలు నిరాధారమైనవని వివరించారు. ఆ ఆస్తిపై షర్మిలకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని తెలిపారు. షర్మిల తరఫు వ్యక్తులు ఈ విషయంలో జోక్యానికి ప్రయత్నిస్తున్నారని, ఇది ఆస్తి వినియోగ హక్కులకు భంగం కలిగిస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో షర్మిల లేదా ఆమె తరఫు వ్యక్తులు తమ ఆస్తిలోకి ప్రవేశించే అవకాశం ఉందని సుధీర్ కోర్టుకు నివేదించారు. వీరి చర్యల వల్ల సదరు ఆస్తిలో నివసిస్తున్న సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్ల భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుందన్నారు. సుగుణమ్మ ఆ ఆస్తిని కుమార్తె, మనవరాళ్లకు గిఫ్ట్‌డీడ్ ఇచ్చారు... ‘ఈ ఆస్తికి 2006 నుంచి ఈ.సి.సుగుణమ్మ సంపూర్ణ యజమానిగా ఉన్నారు. 2007 మార్చి 1న సుగుణమ్మ ఈ ఆస్తిని సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చారు. ఈ లీజు గడువు 2027 ఫిబ్రవరి 28 వరకు ఉంది. 2026 ఆగస్టు 27న సుగుణమ్మ ఈ ఆస్తిని రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ల ద్వారా తన కుమార్తెకు, మనవరాళ్లకు బదిలీ చేశారు. ఆస్తి యాజమాన్యం మారినప్పటికీ సిలికాన్ బిల్డర్స్ లీజు హక్కులు కొనసాగుతున్నాయి. సంస్థ క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తోంది. ఆస్తిలోని భవనాల విద్యుత్, నీటి ఖర్చులు, భద్రత, నిర్వహణ వ్యయాలు సంస్థే భరిస్తోంది. ‘గతంలో తాత్కాలికంగా గెస్ట్ హౌస్‌లో ఉండేందుకు అనుమతి పొందిన షర్మిల, ఇప్పుడు డెకరేషన్ పనుల నెపంతో ఇతరులను ఆస్తిలోకి పంపి స్వా«దీనతకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.’ అని సు«దీర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిజిస్టర్డ్ డీడ్లు, లీజు ఒప్పంద పత్రాలు, అద్దె చెల్లింపు, ఇతర బిల్లుల చెల్లింపు తదితరాలకు సంబంధించిన అన్ని ఆధారాలను ఆయన సమర్పించారు. సిలికాన్ బిల్డర్స్ వాదనలో ప్రాథమిక ఆధారాలున్నాయి... వాటిని పరిశీలించిన కోర్టు, సదరు ఆస్తి సిలికాన్ బిల్డర్స్ లీజు కింద ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సదరు ఆస్తికి మధ్యంతర రక్షణ కల్పించకపోతే తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. అలాగే నోటీసు ఇచ్చే లోపే పిటిషన్ ఉద్దేశం దెబ్బతినే ప్రమాదం ఉన్నందున తక్షణ మధ్యంతర రక్షణ అవసరం ఉందని అభిప్రాయపడింది. అందువల్ల తదుపరి విచారణ వరకు ఈ ఆస్తిలోకి ప్రవేశించి ఆటంకం కలిగించవద్దని, ఆస్తులకు నష్టం చేయవద్దని షర్మిల, ఆమెకు సంబంధించిన వ్యక్తులందరినీ కోర్టు ఆదేశించింది. సీపీసీ నిబంధనల ప్రకారం పిటిషన్, అఫిడవిట్, పత్రాలు, కోర్టు ఉత్తర్వుల ప్రతులను షర్మిలకు అందజేసి, అలా అందించినట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని సిలికాన్ బిల్డర్స్‌ను ఆదేశించింది. ప్రతివాదికి నోటీసులు జారీ చేస్తూ, ఆమె హాజరు, అభ్యంతరాల దాఖలు నిమిత్తం తదుపరి విచారణను డిసెంబర్ 19, 2026కు వాయిదా వేసింది.