తాడేపల్లి: మరోసారి బీసీ వర్గాలను మోసగించేందుకు ఢిల్లీ వేదికగా చంద్రబాబు కొత్త నాటకాలకు తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లపై న్యాయస్థానాలు ప్రశ్నించడంతో చంద్రబాబు బీసీలకు చేసిన ద్రోహం పూర్తిగా బట్టబయలైందని, దీంతో ప్రజల్లో దోషిగా నిలబడలేక ఇప్పుడు ఢిల్లీలో బీసీ మంత్రులతో అబద్ధాలు చెప్పిస్తూ మరో కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. గతంలో న్యాయస్థానం తీర్పును అనుసరించి వైయస్ఆర్‌సీపీ ఎన్నికలకు వెళితే, 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించడానికి వైఎస్ జగన్ కారణమంటూ వెన్నుపోటు పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసపూరిత రాజకీయాలు, వెన్నుపార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన విరుచుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే రూ. 7వేల కోట్లు నిధులు రావని ఆ నెపాన్ని వైయస్ఆర్‌సీపీపై నెట్టే ప్రయత్నం చేయడంపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు, ఎన్నికలు నిర్వహించకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు రావని ఆరోజు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ హామీని అమలు చేయకుండా ఢిల్లీ పర్యటనలు, జీవోలు, ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... బిర్రు ప్రతాప్ రెడ్డితో కేసు వేయించింది మీరు కాదా?: న్యాయస్థానం తీర్పు ఆధారంగా ఆనాడు మేం ఎన్నికలకు వెళ్తే, 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ గారు ప్రయత్నించారని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ 34 శాతం నుంచి రిజర్వేషన్లు తగ్గడానికి కారణమైన బిర్రు ప్రతాప్ రెడ్డితో కేసులు వేయించింది చంద్రబాబు కాదా? 2020లో వైఎస్ జగన్ గారి ప్రభుత్వం 59.5 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు జీవో నెంబర్ 176 తీసుకొస్తే, దాన్ని కోర్టులో సవాల్ చేసింది బిర్రు ప్రతాప్ రెడ్డే కదా? కోర్టు పరిధిలో ఉన్న అంశానికి తీర్పు వచ్చిన తర్వాత, ఆ నెపాన్ని వైయస్ఆర్‌సీపీ పైకి నెట్టడం రాజకీయ కుట్ర కాదా? అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలైలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరిగినప్పుడు, ఆ ప్రభుత్వం కోర్టుకు ఒక అఫిడవిట్ ఇస్తూ కేవలం ఆ ఒక్క ఎన్నికల వరకే అమలు చేస్తామని, తదుపరి కోర్టు తీర్పుకు అనుగుణంగా వెళ్తామని చెప్పింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉండగా, నేడు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అబద్ధాలతో కాలక్షేపం చేస్తోంది. 2018లో 15వ ఆర్థిక సంఘం నిధులు గుర్తుకురాలేదా? : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే కేవలం జీవో సరిపోదు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే కమిషన్ ద్వారా కులాల వారీగా అధ్యయనం చేసి, దాని ఆధారంగా రాష్ట్రంలో చట్టం చేయాలి. ఆ చట్టాన్ని కేంద్రం ఆమోదించాలి, అవసరమైతే షెడ్యూల్ 9లో చేర్చాలి. ఇవన్నీ తెలిసి కూడా రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది? జీవో ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకున్నారు.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో చట్టం చేసి, కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ తన అధికారాన్ని ఉపయోగించి పార్లమెంట్‌లో ఆమోదింపజేయాలి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఆర్థిక సంఘం నిధుల పేరుతో కూడా చంద్రబాబు ప్రభుత్వం మరో డ్రామా చేస్తోంది. రూ. 7 వేల కోట్ల నిధులు ఆగిపోతాయని ప్రచారం చేస్తున్నారు. 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. 2018లో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేకపోవడం వల్లే ఆ నెపాన్ని వైయస్ఆర్‌సీపీ పైకి నెపం నెట్టే కుట్ర చేస్తున్నారు. పార్టీల పరంగా ఇస్తామని చెప్పడం కాదు.. బీసీలకు రిజర్వేషన్లు హక్కుగా ఇవ్వాలి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మీరే అధికారంలో ఉన్నారు. బీసీలకు అన్యాయం చేయకుండా వెంటనే చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి. 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే రాష్ట్రంలో చట్టం చేసి, పార్లమెంట్‌లో ఆమోదింపజేసి, షెడ్యూల్ 9లో చేర్చే ప్రక్రియ ప్రారంభించండి. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను ఏం చేశారు? : చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికే 1994–95లో స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. 1994 ఏప్రిల్‌లోనే రాష్ట్రపతి ఆమోదం వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు. అయినా చంద్రబాబే రిజర్వేషన్లు ఇచ్చాడని అచ్చెన్నాయుడు చెప్పడం వాస్తవ విరుద్ధం. చరిత్రను వక్రీకరించడం మానేసి వాస్తవాలు చెప్పాలి. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ విషయంలో కూడా ఇదే డ్రామా. కమిషన్ వేశారు.. మరి దాని నివేదికను కోర్టుకు సమర్పించారా? ఆ నివేదిక ఆధారంగా చట్టం చేశారా? కమిషన్ వేయడం, నివేదిక తీసుకోకపోవడం, చట్టం చేయకపోవడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారింది. మంజునాథ్ కమిషన్ విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించారు. పూర్తి నివేదిక రాకముందే ఒక సభ్యుడి నివేదికతో రిజర్వేషన్లపై డ్రామా చేశారు. ఇప్పుడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ విషయంలోనూ అదే నాటకం కొనసాగిస్తున్నారు. బీసీ యువతను ఇంకా అమాయకులుగా భావించి డ్రామాలు చేస్తే నమ్మే పరిస్థితి లేదు. జనరేషన్ జీ యువతకు బీసీలకు తలపెట్టిన ద్రోహం పూర్తిగా అర్థమైంది. బీసీలకు రిజర్వేషన్లు కావాలి.. అది జీవో రూపంలో కాదు, పార్టీ హామీగా కాదు.. బీసీల హక్కుగా కావాలి. పవన్ కళ్యాన్ ఉంటే బీసీలు అవసరం లేదనేగా..: పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి బీసీలు అవసరం లేదన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అందుకే బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. బీసీలను ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా చూసి, అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టడం చంద్రబాబు విధానంగా మారింది. అచ్చెన్నాయుడు, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ గార్లు ఢిల్లీకి చంద్రబాబు కోసం వెళ్లారా? బీసీల కోసం వెళ్లారా? బీసీల కోసం వెళ్తే, కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న వెన్నుపోటు పార్టీ అధికారాన్ని ఉపయోగించి 34 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడానికి ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రాకపోవడానికి చంద్రబాబే కారణమైతే, ఆయన వెంట ఢిల్లీకి వెళ్లిన ఈ ముగ్గురు మంత్రులు ఆ ద్రోహానికి సాక్షులుగా చరిత్రలో మిగిలిపోతారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు వెంటనే చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తి చేసి 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. లేకపోతే బీసీలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బీసీ యువతే తగిన గుణపాఠం చెబుతుందని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ హెచ్చరించారు.