కర్నూలు జిల్లా: కోసిగి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీమోహన్‌రెడ్డి, మండల నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు రైతులతో కలిసి శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కోసిగి మండలానికి చోటు కల్పించకపోవడం పట్ల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వలసలకు నిలయంగా ఉన్న కోసిగిని వెంటనే కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం, పశువులకు ఉచిత పశుగ్రాసం, దాణా అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు బేషరతుగా రుణమాఫీ చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తాలను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని కోరారు. వలసల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, తక్షణమే ఉపాధి హామీ పనులు ప్రారంభించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.