పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో రైతులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ రొద్దం మండలంలో వర్షపాతం అత్యల్పంగా ఉండటంతో బోర్లు ఎండిపోయి, పెన్నా నదిలో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రొద్దం మండలాన్ని మధ్యస్థ కరువు మండలంగా కాకుండా తీవ్ర కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంట నష్టం, వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ బృందాన్ని రప్పించాలని కోరారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.25 వేలు, పంటలు వేయలేని రైతులకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే డిమాండ్ చేసిన విషయాన్ని ఉషశ్రీ చరణ్ గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో రైతుల పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించిందని, ప్రస్తుతం రైతులపై అదనపు భారం పడుతోందని ఆమె విమర్శించారు. రైతులు కరువుతో అల్లాడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ఉషశ్రీ చరణ్ ప్రశ్నించారు. మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి రైతుల పక్షాన నిలబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కోరారు. పెన్నా నది, చెరువుల్లో నీరు లేకపోవడంతో పాటు ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు మరింత అడుగంటుతున్నాయని పేర్కొన్నారు. ఇసుక అక్రమ తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరువు కారణంగా పశువులకు మేత కూడా దొరకక రైతులు వాటిని అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఉషశ్రీ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మండలంలో తక్షణమే పశుగ్రాసం ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు పశువులను అమ్ముకోవడం ప్రారంభిస్తే గ్రామాల నుంచి వలసలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. రొద్దం మండలాన్ని తీవ్ర కరువు మండలంగా ప్రకటించి, కేంద్ర బృందాన్ని రప్పించి రైతుల వాస్తవ పరిస్థితులను పరిశీలించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.