సాంకేతిక సమస్య పేరుతో అభ్యర్థుల ప్రజాస్వామ్య హక్కును అడ్డుకోవద్దు

  కుల ధ్రువీకరణ పత్రాల జారీకి మాన్యువల్‌ విధానం అమలు చేయాలి

మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి

నంద్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ స్థానాలకు పోటీ చేయదలచిన అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్‌రెడ్డి కోరారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం సర్వర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం, ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారని కాటసాని తెలిపారు. ఎన్నికల గడువులు సమీపిస్తున్న సమయంలో సర్వర్‌ సమస్య కారణంగా అర్హులైన అభ్యర్థులు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి రాకూడదన్నారు. సాంకేతిక సమస్య ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు సంబంధించినదే తప్ప అభ్యర్థుల తప్పిదం కాదని పేర్కొన్నారు.

సర్వర్‌ సమస్య పరిష్కారమయ్యే వరకు మాన్యువల్‌గా కుల ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు స్వీకరించి, నిబంధనల ప్రకారం పరిశీలన పూర్తి చేసి అర్హులైన అభ్యర్థులకు సకాలంలో సర్టిఫికెట్లు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఒక్క అర్హుడైన అభ్యర్థి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, సమాన అవకాశాలతో జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా, శిల్ప భువనేశ్వరరెడ్డి, పీపీ నాగిరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, సద్దల సూర్యనారాయణరెడ్డి, సుమంత్‌రెడ్డి, మధుమోహన్‌రెడ్డి, దాల్‌మిల్‌ అమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top