రాయలసీమకు ఏం చేశారో చెప్పండి చంద్రబాబూ?

 వైయ‌స్సార్‌, జగన్‌ హయాంలోనే సీమ అభివృద్ధి: ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌

 

తాడేపల్లి :రాయలసీమ బిడ్డనని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతానికి చేసిందేమీ లేదని, పైగా సీమ ప్రయోజనాలను నిలువునా తాకట్టు పెడుతూ ప్రజలను, రైతులను ఘోరంగా వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణం కేవలం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల హయాంలోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. రాయలసీమలో ఏర్పాటు కావాల్సిన కీలక ప్రభుత్వ, విద్యా, సాంకేతిక సంస్థలను నిస్సిగ్గుగా అమరావతికి తరలించుకుపోతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదనే భయంతోనే చంద్రబాబు 'రైజింగ్ రాయలసీమ', లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని ఆయన  తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... 

రాయలసీమకు చంద్రబాబు చేసింది శూన్యం..

రాయలసీమ బిడ్డనని, ఇక్కడే పుట్టానని నిత్యం సభల్లో చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతానికి ఏం చేశారో సమాధానం చెప్పాలి. రాయలసీమ అంటే గుర్తుకొచ్చేది వైఎస్సార్ కుటుంబం మాత్రమే. కరవు సీమ కన్నీళ్లు తుడిచి, ప్రాజెక్టులు కట్టి, ప్రతి ఇంటినీ అక్కున చేర్చుకున్న నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నేతృత్వంలో వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో తాగడానికి గుక్కెడు నీరు లేదు, సాగుకు నీరందక లక్షలాది ఎకరాల్లో పంటలు, ఉద్యానవన తోటలు ఎండిపోతున్నాయి. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు.

దోచుకో.. దాచుకో.. పంచుకో విధానం..

ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ. 24 వేల కోట్లు ఖర్చు చేశామని కూటమి నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆ నిధులతో రాయలసీమలో అదనంగా ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా? వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన  నీళ్ల కంటే ఒక్క క్యూసెక్కు నీరైనా అదనంగా ఇచ్చారా? కూటమి ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ 'దోచుకో.. దాచుకో.. పంచుకో' విధానంలోనే నడుస్తున్నాయి. నాసిరకం పనులతో ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, 'రాజేష్.. సూట్‌కేస్.. లోకేష్' అన్న రీతిలో ముడుపులు దండుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

సంస్థలన్నీ అమరావతికే తరలింపు - సీమపై కక్ష ఎందుకు?

రాయలసీమలో పరిశ్రమలు, విద్యాసంస్థలు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కొప్పర్తిలో జగన్ ప్రభుత్వం తెచ్చిన ఎంఎస్ఎంఈ (MSME) టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి తరలించడానికి జీవో నెం. 56 ఇచ్చి 20 ఎకరాల భూమి ఎందుకు కేటాయించారు?. సీమ యువతకు ఉపాధి దక్కకూడదనే కక్ష కాదా?. కర్నూలులో ఏర్పాటైన మానవ హక్కుల కమిషన్ (HRC), లోకాయుక్తలను అమరావతికి తరలిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు ఎందుకు నివేదించింది? ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే ఉండాలని కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయలేదు?.  తిరుపతిలో ఐఐటీ విస్తరణ, జాతీయ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞాన సంస్థ (NIELIT) సంస్థల తరలింపు యోచనలు ఎందుకు చేస్తున్నారు? వైయస్. జగన్ ప్రభుత్వం తిరుపతిలో 50 ఎకరాల్లో ప్రతిపాదించిన స్కిల్ యూనివర్సిటీని ఎందుకు అటకెక్కించారు?.

కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చింది వైఎస్ జగనే..

చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి దశాబ్దాలుగా సాగునీరు అందించలేని అసమర్థత ఆయనది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ పూర్తి చేసి, పనులు పరుగులు పెట్టించి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను అందించారు. కనీసం సాగునీరే ఇవ్వలేని చంద్రబాబు.. కుప్పంలో కూరగాయలు పండించి విమానాల్లో ఎగుమతి చేస్తామని సభల్లో విడ్డూరపు కబుర్లు చెబుతున్నారు. నీళ్లివ్వకుండా కూరగాయలు ఎలా పండుతాయి? ఎయిర్‌పోర్టు ఎక్కడ ఉంది? విమానాల్లో ఎగుమతి ఎలా చేస్తారు?.

వైద్యరంగంలో జగన్ విప్లవం - మెడికల్ కాలేజీల అభివృద్ధి.

రాయలసీమ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో నంద్యాల, పులివెందుల, మదనపల్లె, ఆదోని, పెనుకొండల్లో ఏకకాలంలో ఐదు కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసి రూ. 2,500 కోట్లు కేటాయించిన ఘనత వైఎస్ జగన్‌‌ది. నంద్యాల వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి, పులివెందుల కళాశాల సిద్ధమైంది. అంతేకాకుండా తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప పాత మెడికల్ కాలేజీల నవీకరణకు రూ. 1,275 కోట్లు వెచ్చించాం. కడపలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. రాయలసీమలోని ఏ పల్లెకు వెళ్లినా ప్రజలే స్వయంగా జగన్ చేసిన పనుల గురించి చెబుతారు.

ఎన్నికల భయంతోనే కొత్త డ్రామాలు..

ఈ నేపధ్యంలో చంద్రబాబుకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎనికల్లో రాయలసీమలో కూటమి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవనే భయంత పట్టుకుందని... అందుకే బాబు'రైజింగ్ రాయలసీమ', 'లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్' అంటూ సరికొత్త అబద్ధాల నాటకానికి తెరతీశారని రమేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా చంద్రబాబు కల్లబొల్లి మాటలను, వెన్నుపోట్లను నమ్మే స్థితిలో రాయలసీమ ప్రజలు లేరని తేల్చి చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, వైఎస్సార్‌సీపీని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు.

Back to Top