ఎన్నికల ప్రక్రియలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం

 ఓటర్ల జాబితా, డివిజన్లు, వార్డుల వర్గీకరణలో అధికారుల ఇష్టారాజ్యం

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన రవీంద్రనాథ్‌రెడ్డి

 వైయ‌స్ఆర్‌ కడప జిల్లా:  ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎస్సీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌కుమార్‌, మాజీ మేయర్‌ పాక సురేష్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా, డివిజన్లు, వార్డుల వర్గీకరణలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని, మున్సిపాలిటీల్లో నో-డ్యూస్‌ సర్టిఫికెట్లు అందక ప్రజలు, అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సచివాలయాలు, మీ-సేవ, ఎంఆర్‌ఓ, మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరుగుతున్నా అధికారులు బాధ్యతలను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై న్యాయపోరాటం చేస్తామని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలనకు బదులుగా ‘రెడ్‌ బుక్‌’ విధానం కొనసాగుతోందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు.

Back to Top