కూటమి ప్రభుత్వం మహిళల పాలిట శాపం

రాష్ట్రంలో మహిళల రక్షణ పూర్తిగా ప్రశ్నార్థకం

నాగ మల్లీశ్వరి ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి.

తాడేపల్లి: వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడబిడ్డ ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా వస్తుందా లేదా అనే భయంతో తల్లిదండ్రులు బతుకుతున్న పరిస్థితి నెలకొందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ధ్వజమెత్తారు. మహిళలపై రోజుకు 45కి పైగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని వారే చెబుతున్నారని, కానీ రక్షణ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం నిద్ర పోతున్నట్లు వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి నిమిషం ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నా, వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పబ్లిసిటీ రాజకీయాలకే పరిమితమయ్యారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి దుయ్యబట్టారు. 
ప్రెస్‌మీట్‌లో నాగ మల్లీశ్వరి ఇంకా ఏం మాట్లాడారంటే..:

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోనూ బాలికలకు రక్షణ కరువు:
ఇటీవల జరిగిన ఎన్నో ఘటనలు రాష్ట్రంలో మహిళల రక్షణను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. రైల్వే కోడూరులో ప్రభుత్వ పాఠశాల బాలికను ఆటో డ్రైవర్‌ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికను 45 ఏళ్ల వ్యక్తి ఆటోలో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడి చేశాడు. గత ఆగస్టు చివర్లో విజయవాడ వాంబే కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపర్చారు. మరుసటి రోజు ఆమె అపస్మారక స్థితిలో కనిపించడంతో ఘటన బయటపడింది. అంటే చివరకు ఇంట్లో కూడా మహిళలకు ఏ మాత్రం భద్రత లేకుండా పోవడం.. ఇక గంజాయి బ్యాచ్‌ ఆగడాలకు పరాకాష్ట. 
    నిన్నటికి నిన్న విజయవాడలో జరిగింది. ఒక మహిళా ఎస్‌ఐ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా, బైక్‌పై వెంబడించిన ఇద్దరు యువకులు కారుకు అడ్డం పడి, వేధించారు. ఇది విజయవాడ వంటి నగరంలో, చివరకు నడిరోడ్డుపైనా మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిన దారుణ పరిస్థితిని తెలియజేస్తోంది. రావులపాలెంలో పదేళ్ల బాలికపై పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న స్థానిక వెన్నుపోటు పార్టీ నేత అసభ్యంగా ప్రవర్తించాడని కుటుంబం ఆరోపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఎన్నెన్నో ఘటనలు. 
    అనకాపల్లి జిల్లాలో మైనర్‌ బాలికను గొంతుకోసి చంపేశారు. ఈ ఘటనలో తల్లిదండ్రులు ముందుగానే ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో రెండు రోజుల తర్వాత ఆ బాలికను నేరుగా ఇంటికెళ్లి హత్య చేశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో అత్తాకోడళ్లపై అత్యాచారం జరిగినా ప్రభుత్వం స్పందించ లేదు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలోనే ఆడబిడ్డలను బట్టలు ఊడదీసి కొట్టినా చర్యలు తీసుకోలేదు. బీసీ హాస్టల్‌లోనూ ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. ఒక అధికారి ఇద్దరు ఆడబిడ్డలను తీసుకెళ్లి తన ఇష్టానుసారంగా వ్యవహరించిన ఘటనలు కూడా రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్నాయి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందో హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. 

హోం మంత్రికి బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా?: 
    చిన్నారులు, బాలలపై అత్యాచారాలకు సంబంధించిన ‘పోస్కో’ కేసులు కూడా 1879 నమోదయ్యాయి. ఇన్ని కేసులు నమోదవుతున్నా బాధిత కుటుంబాలకు మీరు భరోసా ఇస్తున్నారా? ఎన్ని కేసుల్లో న్యాయం చేశారో హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. గతంలో మహిళల రక్షణ కోసం వైఎస్‌ జగన్‌ గారు తీసుకొచ్చిన దిశ యాప్‌ను విమర్శించిన వెన్నుపోటు పార్టీ, ఇప్పుడు వారు తీసుకొచ్చిన వ్యవస్థలు ఎందుకు పనిచేయడం లేదో చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే, ఆడబిడ్డల మీద ఇప్పటివరకు 16,347 అఘాయిత్యాలు జరిగాయి. అంటే, రోజుకి దగ్గర దగ్గరగా 45 కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చెప్పడానికి ఇటీవల జరిగిన ఘటనలే నిదర్శనం. 

యాప్‌లు, పోలీసులు, ఇంటిలిజెన్స్‌ వ్యవస్థలు ఏమయ్యాయి?:
    ఆడబిడ్డల కన్నీళ్లను పట్టించుకోకుండా సన్మానాలకు, ప్రచార కార్యక్రమాలకు, సినిమా ఫంక్షన్లకు, ఆటల పోటీలకు సమయం కేటాయించే హోంమంత్రి అనితకి, అత్యాచార బాధిత కుటుంబాలను పరామర్శించడానికి మాత్రం సమయం లేదా? మహిళలకు పటిష్టమైన చట్టాలు తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. మరి 26 నెలల పాలనలో మహిళల భద్రత కోసం మీరు తీసుకొచ్చిన చట్టం ఏంటి? తీసుకున్న చర్యలు ఏంటి? ప్రజలకు చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత నియోజకవర్గాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
    నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో అత్తాకోడళ్లపై అత్యాచారం చేసిన నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దల నియోజకవర్గాల్లోనే మహిళకు రక్షణ కల్పించలేకపోతోంది.  ఘటనలు జరిగినప్పుడు కూడా సమర్థవంతంగా స్పందించలేకపోతోంది. వారు తీసుకొచ్చిన యాప్‌లు, పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్‌ పని చేస్తుందని ఎలా అనుకోవాలి? అందుకే ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో విఫలమైన ఈ కూటమి ప్రభుత్వానికి, రాబోయే రోజుల్లో మహిళలే గుణపాఠం చెబుతారని నాగమల్లీశ్వరి హెచ్చరించారు.

Back to Top