తాడేపల్లి: రిజర్వేషన్ల పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ సమాజాన్ని దారుణంగా మోసం చేశారని, చట్టబద్ధత లేకుండా తెచ్చిన జీవో నెంబర్ 105, 1065లను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన కుటిల నైజం మరోసారి బట్టబయలైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా రాజ్యాంగ సవరణ చేయకుండా, కేవలం కోర్టుల్లో నిలబడవని తెలిసినా చెల్లని జీవోలు ఇచ్చి సొంత పార్టీ నేతలతో పాలాభిషేకాలు చేయించుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. న్యాయపరంగా నిలబడని నిర్ణయాలు తీసుకుంటూ, తన అనుచరుల చేతే కోర్టుల్లో కేసులు వేయించి బీసీ వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వెంటనే రాష్ట్రంలోని యావత్ బీసీ సమాజానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు రానున్న ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. చెల్లని జీవోలతో పాలాభిషేకాలు చేయించుకోవడం సిగ్గుచేటు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, బీసీలను తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు 105, 1065 జీవోల డ్రామా ఆడారు. కోర్టులో నిలబడవని స్పష్టంగా తెలిసినా జీవోలు జారీ చేసి, తన పార్టీలోని బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాలాభిషేకాలు చేయించుకుని బీసీలకే తీరని ద్రోహం చేశారు. ఇప్పుడు హైకోర్టు ఆ జీవోలను కొట్టివేయడంతో, పాలాభిషేకాలు చేసుకున్న బీసీ నేతలు తమ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి, అదే వర్గాలను రాజకీయంగా అణగదొక్కడం చంద్రబాబుకు మొదటినుంచీ అలవాటే. తన మనుషులతోనే కేసులు వేయించే కుటిల రాజకీయం. 2019 డిసెంబర్ 28న వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు జీవో నెం. 176 ద్వారా బీసీలకు 59.5% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చూస్తే, తన అనుచరుడు బిర్రు ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసు వేయించి అడ్డుకున్నది చంద్రబాబే. ఆనాడు సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఆర్థిక సంఘం నిధుల కోసం 24 శాతంతో ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే, జగన్ గారే రిజర్వేషన్లు తగ్గించారంటూ ఐదేళ్లపాటు చంద్రబాబు పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా తన అనుచరుల ద్వారానే జీవోలను కోర్టులో సవాల్ చేయించి, మరోసారి బీసీలకు తీరని అన్యాయం తలపెట్టారు. వైయస్ జగన్ గారిపై ఐదేళ్లుగా చేసిన విష ప్రచారానికి చంద్రబాబు వెంటనే ఆయనకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉండి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయించలేదు? కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే 34% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో ఎందుకు చర్చ పెట్టించలేదు?. తమిళనాడు తరహాలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేసుకునేలా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే ప్రతిపాదనను కేంద్రం ముందు ఎందుకు ఉంచలేదు? చట్టం చేసే అధికారం, కేంద్రంలో పలుకుబడి ఉన్నా ఏమీ చేయకుండా, కేవలం కంటితుడుపు జీవోలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పుస్తకాలు చదివానని చెబుతారు కదా.. బీసీల రిజర్వేషన్ల కోతపై ఎందుకు నోరు మెదపడం లేదు? కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో ఎందుకు రిజర్వేషన్ల సాధనకు చొరవ చూపలేదు?. పవన్ కళ్యాణ్ అండగా ఉంటే తమకు 52 శాతం ఉన్న బీసీలు అవసరం లేదన్నట్లుగా పాలకులు అహంకారంతో వ్యవహరిస్తున్నారు. బీసీలకు వైఎస్ జగన్ పాలనలోనే అసలైన న్యాయం.. న్యాయస్థాన పరిమితుల వల్ల రిజర్వేషన్లు 24 శాతానికే పరిమితమైనా, వైయస్ జగన్ గారు రాజకీయంగా బీసీలకు 34 శాతానికి మించి పదవులు కేటాయించి చూపించారు. గత ప్రభుత్వంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్లలో 6 స్థానాలను (46%), మండల పరిషత్తుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 67 శాతం ఇచ్చి అందులో 40 శాతానికి పైగా బీసీలకే కేటాయించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మంత్రివర్గం, చివరకు రాజ్యసభ స్థానాల్లోనూ బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత వైయస్.జగన్ దే. వైయస్ జగన్ బీసీలకు సంక్షేమంలోనే కాకుండా రాజకీయంగానూ నిజమైన బంధువులా అండగా నిలిచారు. ఆరు వారాల్లో ఎన్నికలు.. బీసీలకు 34% సీట్లు ఇచ్చి తీరాల్సిందే.. మరోవైపు హైకోర్టు ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన నేపధ్యంలో... ఈ స్వల్ప వ్యవధిలో బీసీలకు ఎలా న్యాయం చేస్తారని వేణుగోపాలకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ బీసీలను మభ్యపెట్టేందుకు మరో నాటకానికి తెరతీస్తున్నారని.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని ఆశపడుతున్న లక్షలాది మంది బీసీ యువకుల కలలను చంద్రబాబు చిదిమేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 34 శాతం సీట్లు కేటాయించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ ద్రోహి చంద్రబాబు కుట్రలను ఊరూరా, వీధివీధినా ఎండగడతామని.. రాబోయే రోజుల్లో ఆయన మోసాలకు బీసీ సమాజం తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.