మార్కాపురం జిల్లా: వెలిగొండ ప్రాజెక్టు కోసం తమ భూములు, ఇళ్లు, జీవనాధారాలను త్యాగం చేసిన నిర్వాసితులను ప్రభుత్వం పట్టించుకోకుండా పక్కన పెట్టిన పరిస్థితిలో, వారి కష్టాలను తెలుసుకునేందుకు యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, అడ్వకేట్ రజిని వారి స్థావరాల వద్దకే వెళ్లారు. కనీస మౌలిక వసతులు లేక నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా కళ్లారా చూసి, వారి బాధలను నేరుగా విన్నారు. ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులను ఇలా గాలికి వదిలేయడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నిసార్లు తమ సమస్యలను మొరపెట్టుకున్నా పట్టించుకోని పాలకులు, కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతను కూడా విస్మరించడం దారుణమని పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యలను తెలుసుకున్న అనంతరం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అక్కడే అధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. నిర్వాసితుల ఇబ్బందులను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేస్తూ, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ప్రభుత్వం పక్కకు తప్పుకున్న చోట ప్రజల పక్షాన ఎమ్మెల్యే ముందుకొచ్చి నిర్వాసితుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం వారికి భరోసా కల్పించింది. వెలిగొండ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన కుటుంబాలకు న్యాయం జరిగేలా వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరఫున పోరాటం కొనసాగుతుందని తెలిపారు.