తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డ్రాట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడంతోపాటు ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీని ప్రకటించాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 54.73 శాతం లోటు వర్షపాతం నమోదైందని, 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే ఉందని, 685 మండలాలకు గాను 653 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సాగు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, వర్షాధార పంటలైన వేరుశెనగ, పత్తి, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ, పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు నష్టపరిహారం అందించాలని, ఆ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా బకాయిలు, సున్నా వడ్డీ రాయితీ, అన్నదాత సుఖీభవ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. రైతులకు భరోసా కల్పించేందుకు ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, సాగునీటి లభ్యతను సమర్థంగా వినియోగించి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు ఆర్థికంగా కుప్పకూలితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలోకి వెళ్తుందని హెచ్చరించిన నాగిరెడ్డి, ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకు పరిమితం కాకుండా అత్యవసర చర్యలు చేపట్టి రైతుల ఖాతాల్లోకి నేరుగా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. “రైతుకు న్యాయం చేయడం దయ కాదు.. అది ప్రభుత్వ బాధ్యత” అని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 54.73 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే ఉంది. 685 మండలాలకు గాను 653 మండలాల్లో లోటు వర్షపాతం నమోదవడం అంటే 94.9 శాతం మండలాలు సంక్షోభంలో ఉన్నట్టే. అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, మార్కాపురం, విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇంతటి సంక్షోభ సమయంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దేశంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సాగు పరిస్థితి దారుణం దేశవ్యాప్తంగా సాధారణ సాగులో 98.3 శాతం సాగు జరిగితే, తెలంగాణలో 91.84 శాతం సాగు జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 69 శాతం మాత్రమే సాగు జరిగింది. వరి విషయంలో దేశవ్యాప్తంగా 102.38 శాతం సాగు నమోదైతే, తెలంగాణలో 80.13 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 73 శాతం మాత్రమే సాగైంది. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, వేరుశెనగ వంటి పంటల్లోనూ రాష్ట్రం వెనుకబడి ఉంది. ఇవన్నీ అధికారిక వ్యవసాయ శాఖ గణాంకాలే. విధ్వంసం ఎవరి పాలనలో? చంద్రబాబు గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసం జరిగిందని పదేపదే మాట్లాడుతున్నారు. గత చంద్రబాబు పాలనలో 2014-15 నుంచి 2018-19 వరకు మొత్తం 1,623 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారు. జగన్ గారి పాలనలో 2019-20 నుంచి 2022-23 వరకు ఒక్క మండలం కూడా కరువు మండలంగా లేదు. 2023-24లో 103 మండలాలు కరువు మండలాలుగా ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ రంగంలో విధ్వంసం ఎవరి పాలనలో జరిగిందో ప్రజలు, రైతులు ఆలోచించాలి. నేను చెబుతున్న గణాంకాలు అధికారికమైనవి. ప్రత్యామ్నాయ పంటల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు రాష్ట్రంలో వర్షాధారంగా సాగు చేసే వేరుశెనగ, పత్తి, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు వంటి పంటలు ఇప్పటికే వర్షాభావంతో దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతోంది. ప్రత్యామ్నాయ పంట వేయాలంటే ముందుగా వర్షం పడాలి కదా? విత్తనం వేయడానికి అవసరమైన వర్షం లేకుండా ప్రత్యామ్నాయ పంటలు ఎలా వేయాలి? ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యామ్నాయ పంటలపై సమగ్ర ప్రణాళికను విడుదల చేసిందా? అత్యధిక సబ్సిడీతో ప్రత్యామ్నాయ విత్తనాలు అందించిందా? అంటే, ఎక్కడా చేయలేదు. కృష్ణా డెల్టాలో వరి సాగుపై ప్రభుత్వ విధానం కృష్ణా డెల్టాలో వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ మెట్ట పంటలు వేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఇది ఆచరణ సాధ్యం కాని మాట. కృష్ణా జిల్లాలో జరిగిన మొత్తం సాగులో 3.34 లక్షల ఎకరాలకు గాను 3.28 లక్షల ఎకరాల్లో, అంటే 98.2 శాతం విస్తీర్ణంలో వరి సాగైంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రైతాంగం కూడా ప్రత్యామ్నాయ పంటల మాట ఎందుకు పాటించడం లేదు? వాస్తవ పరిస్థితి ఇక్కడే స్పష్టమవుతోంది. పంటలకు మద్దతు ధరలు లేక రైతుల అగచాట్లు రాష్ట్రంలో రైతుల పెట్టుబడి వ్యయం పెరుగుతోంది, ఆదాయం మాత్రం పడిపోతోంది. పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉల్లి, సజ్జ, మొక్కజొన్న, అరటి, పొగాకు వంటి పంటల్లోనూ రైతులు ధరల సమస్యను ఎదుర్కొంటున్నారు. పొగాకు విషయంలో గత ఏడాదితో పోలిస్తే సగటు ధర గణనీయంగా తగ్గింది. ఉత్పత్తి వ్యయం పెరిగిన సమయంలో రైతుకు లభించే ధర తగ్గిపోతే రైతు ఎలా బతకాలి? వ్యవసాయానికి ప్రణాళికాబద్ధమైన మార్కెటింగ్ విధానం అవసరం. తక్షణం డ్రాట్ ఎమర్జెన్సీ ప్రకటించాలి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డ్రాట్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను గుర్తించి, వారు నష్టపోయిన మేరకు ఎకరాకు పరిహారం అందించాలి. ఆ సహాయాన్ని ప్రకటనలకే పరిమితం చేయకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా బకాయిలు, సున్నా వడ్డీ రాయితీ, అన్నదాత సుఖీభవ కింద ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. రైతు కుటుంబాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా నిలవాలి. రైతు కష్టాల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం రైతు కుటుంబం పక్కన నిలబడాల్సిన అవసరం ఉంది. ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి రైతులకు ఎంతో ఉపయోగపడిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు పంటలు దెబ్బతిన్న తర్వాత రైతులే బీమా ప్రీమియం చెల్లించుకోవాలని చెప్పడం సరికాదు. పత్తికి ఎకరానికి రూ.1,800, మిర్చికి రూ.2,800, అరటికి రూ.3,000 వంటి ప్రీమియం మొత్తాలను ఈ సంక్షోభ సమయంలో రైతులు ఎలా భరించగలరు? ప్రభుత్వం వెంటనే ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. రైతు కుటుంబం ఆర్థికంగా కుప్పకూలితే దాని ప్రభావం రైతుతో మాత్రమే ఆగిపోదు. వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారులు, చిరువ్యాపారులు అందరూ సంక్షోభంలోకి వెళ్తారు. రైతు వలస వెళ్తే, పశుగ్రాసం లేక పశువులను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే, అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. గ్రామాలు రాష్ట్రానికి వెన్నెముక. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక. రైతుకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలు కాకుండా రైతుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి. డ్రాట్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. పెండింగ్ బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలి. సాగునీటి లభ్యతను సమర్థంగా వినియోగించాలి. రైతు కష్టాల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం రైతు పక్కన నిలబడాలి. రైతుకు న్యాయం చేయడం దయ కాదు. అది ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.