రాజమండ్రి : కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను నట్టేట ముంచిందని, పరీక్షల నిర్వహణ నుంచి స్పోర్ట్స్ కోటా వరకు అంతా అవినీతిమయంగా మార్చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం రాజమండ్రిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై వైఎస్సార్‌సీపీ గత 6-8 నెలలుగా ఆధారాలతో సహా గొంతెత్తుతున్నా చంద్రబాబు, లోకేష్‌లలో కనీస చలనం లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తప్పులను ప్రశ్నిస్తున్న వారి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏకకాలంలో లక్షన్నర సచివాలయ ఉద్యోగాలను ఒక్క ఆరోపణ లేకుండా పారదర్శకంగా భర్తీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. గత వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టిన నియామకాలతో పాటు ప్రస్తుత డీఎస్సీ కుంభకోణంపై సిట్టింగ్ సీబీఐ విచారణ వేయించాలని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా బయటపడుతున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రాజా డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. - హెరిటేజ్ పాలు, పెరుగు అమ్మినట్లు పోస్టుల విక్రయం.. ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి ఓట్లు దండుకున్నారు. గద్దెనెక్కిన తర్వాత హెరిటేజ్ పాలు, పెరుగు అమ్మినట్టుగా టీచర్ పోస్టులను మార్కెట్లో అమ్ముకుంటున్నారు. నోటిఫికేషన్ నుంచి మొదలుపెడితే టెట్, డీఎస్సీకి ఒకే కన్వీనర్‌ను పెట్టడం, మెరిట్ లిస్టులను సెంట్రలైజ్డ్‌గా ప్రకటించి మాయం చేయడం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌ను తుంగలో తొక్కడం చూస్తుంటే వ్యవస్థలను ఏ స్థాయికి దిగజార్చారో స్పష్టమవుతోంది. సంతలో బర్రెలను అమ్మినట్టుగా పోస్టులను తెగనమ్మారు. లోకేష్ విద్యాశాఖ మంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు, చిన్న పిల్లలకు పట్టిన శాపం. - స్పోర్ట్స్ కోటాలో విచ్చలవిడి దొంగ సర్టిఫికెట్లు.. కనీసం జీవితంలో గ్రౌండ్‌లో అడుగుపెట్టని వారికి, టెట్ క్వాలిఫై కానివారికి కూడా ఉద్యోగాలు కట్టబెట్టారు. అసలు నిర్వహించని టోర్నమెంట్లకు దొంగ సర్టిఫికెట్లు సృష్టించి నేషనల్ లెవెల్ క్రీడాకారుల పొట్టకొట్టారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నడిచిన వారికి, ఆయన చెంచాలకు అడ్డగోలుగా పోస్టులు పంచిపెట్టారు. కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆధారాలతో సహా అక్రమాలు వెలుగుచూస్తున్నా సంజాయిషీ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. - ఆడియో టేపులు బయటపడినా చర్యలేవి? ప్రశ్నిస్తే అకౌంట్ల బ్లాక్.. ఒక్కో టీచర్ పోస్టును రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు అమ్ముకుంటున్న ఆడియో టేపులు బట్టబయలైనా ఈ రోజు వరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించేందుకు పోలీసులను సొంత ట్రస్ట్ భవనం ఉద్యోగుల్లా వాడుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ తప్పిదాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధికారిక పేజీలను, ప్రజల అకౌంట్లను బ్లాక్ చేయిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడమేనా మీ ప్రజాపాలన?. - జగన్ హయాంలో లక్షన్నర ఉద్యోగాలు పారదర్శకంగా భర్తీ.. మా ప్రభుత్వ హయాంలో దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏకకాలంలో లక్షన్నర సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఎక్కడా ఒక్క చిన్న అవకతవక గానీ, ఆరోపణ గానీ రాలేదు. కానీ ఇవాళ డీఎస్సీలో అవినీతి బయటపడటంతో.. మా హయాంలో కాల్ లెటర్ల దశకు చేరిన ఫారెస్ట్ తదితర ఉద్యోగాలను కూడా నిలిపివేసి వేలాది మంది నిరుద్యోగుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటమాడుతోంది. - దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించండి.. గతంలో జగన్ మోహన్ రెడ్డి గారిపై ఆరోపణలు వచ్చినప్పుడు.. 'నా కొడుకు తప్పు చేసుంటే ఉరి వేయండి' అని అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్ గారు చెప్పిన చరిత్ర మాది అని రాజా స్పష్టం చేశారు. ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది... మీకు చిత్తశుద్ధి ఉంటే మా హయాంలో జరిగిన పరీక్షలతో పాటు ప్రస్తుత డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. డిఎస్సీపై విచారణ జరిగితే బ్రోకర్ల నుంచి లోకేష్ ఖాతాల్లోకి ఎన్ని కోట్లు వెళ్లాయో బయటకు వచ్చి, జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందనే భయంతోనే వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాలు సైతం సుమోటోగా ఈ కుంభకోణంపై స్పందించాల్సిన అవసరం ఉందన్న రాజా.. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ వేయడంతో పాటు, లోకేష్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.