విజయనగరం: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే, వారితో చర్చించకుండా పోలీసుల ద్వారా అమానుషంగా దాడులు, అక్రమ అరెస్టులు చేయించడం వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మరోవైపు కళింగపట్నం వద్ద తీరం దాటిన తుపానుతో ఉత్తరాంధ్రలో అరటి, బొప్పాయి, మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు. వాస్తవ నష్టానికి అనుగుణంగా రైతులకు తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని విజయనగరంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే..: సచివాలయ వ్యవస్థపై దాష్టీకం.. ఉద్యోగుల గొంతు నొక్కే యత్నం: మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వినూత్నంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ఎంతో పారదర్శకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఇంజనీరింగ్, పీజీ, డాక్టరేట్లు చేసిన విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ నియామక ప్రక్రియను స్వయంగా నేనే పర్యవేక్షించాను. ప్రస్తుతం సర్వీస్, ప్రమోషన్లు, పీఆర్సీ వంటి న్యాయమైన సమస్యలపై ఉద్యోగులు గొంతెత్తితే కూర్చోబెట్టి మాట్లాడే తీరిక, ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రవ్యాప్తంగా చలో విజయవాడకు పిలుపునిచ్చిన సుమారు 3 వేల మంది ఉద్యోగులను అక్రమంగా అరెస్టు చేశారు. విజయవాడలో వివిధ సంఘాలకు చెందిన 140 మంది నాయకులను అదుపులోకి తీసుకుని వేధించారు. మహిళా ఉద్యోగులపై సైతం పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం నియంతృత్వ పాలనకు పరాకాష్ట. తుపానుతో నేలమట్టమైన పంటలు.. రైతులను వెంటనే ఆదుకోవాలి: కళింగపట్నం వద్ద తుపాను తీరం దాటడంతో ఉత్తరాంధ్ర, తూర్పు తీర ప్రాంతాల్లో రైతులు సర్వస్వం కోల్పోయారు. అరటి, బొప్పాయి, మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అరటికి ఎకరాకు ఒక లక్ష, బొప్పాయికి రూ.1.50 లక్షలు, మొక్కజొన్నకు రూ.50 వేల చొప్పున రైతులు పెట్టిన పెట్టుబడి అంతా గాల్లో కలిసిపోయింది. గత ప్రభుత్వంలో రైతు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంను సైతం ప్రభుత్వమే చెల్లించి, విపత్తు జరిగిన రెండు నెలల్లోనే ఇన్ పుట్ సబ్సిడీ, పరిహారం అందించాం. కొత్త విధానం తెస్తామన్న కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా ఏ ఒక్క రైతుకైనా నష్టపరిహారం ఇచ్చిందా? గతంలో వచ్చిన తిత్లీ తుపాను పరిహారాన్ని కూడా నేటికీ ఇవ్వలేదు. రైతులకు ఇచ్చే నష్టపరిహారం ఏమైనా పాలకులు తమ సొంత జేబుల్లోంచి ఇస్తున్నారా? మొక్కుబడిగా కాకుండా, వాస్తవ నష్టానికి అనుగుణంగా రైతులకు తక్షణమే పరిహారం ప్రకటించాలి. ఠాణాల్లో సెటిల్మెంట్లు.. పోలీసుల బెదిరింపులు: రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారు. పోలీస్ స్టేషన్లలో తప్ప ఎక్కడా ఎలాంటి పాలనా కార్యకలాపాలు సాగడం లేదు. రెవెన్యూ, మండల, వ్యవసాయ కార్యాలయాల్లో పరిష్కారం కావాల్సిన సమస్యలన్నీ నేడు పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లుగా మారిపోయాయి. రేపు జరగనున్న స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష మద్దతుదారులు పోటీ చేయవద్దంటూ పోలీసులే నేరుగా ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. కోర్టులు పదే పదే మొట్టికాయలు వేస్తున్నా రాష్ట్ర డీజీపీ, పోలీసు ఉన్నతాధికారుల తీరు మారకపోవడం శోచనీయం. స్థానిక ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 34 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉంది కాబట్టి, వెంటనే పార్లమెంటులో చట్ట సవరణ తీసుకువచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పించాలి. అలా చేయకుండా సాంకేతిక కారణాలు చూపుతూ బీసీలకు ద్రోహం చేయాలని చూస్తే సహించేది లేదు. స్వార్థపరులే పార్టీ మారుతున్నారు: మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వలసల నష్టం లేదు. ఎక్కడ అధికారం, లాభం ఉంటే అటువైపు వెళ్లే ఒకరిద్దరు స్వార్థపరులు పార్టీ మారినంత మాత్రాన పోయేదేమీ లేదు. ఎవరైతే ఆర్థిక లావాదేవీల్లో, భూ వ్యవహారాల్లో చిక్కుకున్నారో వారే కేసులు, దర్యాప్తుల నుంచి రక్షణ కోసం అధికార పార్టీ వైపు వెళ్తున్నారు. ఎవరెళ్లిపోయినా తమ పార్టీకి కలిగే నష్టం ఏ మాత్రం లేదని, రాబోయే రోజుల్లో తిరిగి అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.