తిరుపతి: సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం లాఠీచార్జి చేయడాన్ని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా ఖండించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో లక్షా 26 వేల మందిని సచివాలయ ఉద్యోగులుగా నియమించిన చరిత్ర ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని, వారికి ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధర్నాచౌక్‌లో సుమారు లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగులు చేపట్టిన నిరసన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని భూమన తెలిపారు. ఉద్యోగులపై లాఠీచార్జి చేసి, సుమారు 700 మందిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని పేర్కొంటూ, సచివాలయ ఉద్యోగుల సమస్యలపై వైయస్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండి ఉంటే ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేవని భూమన పేర్కొన్నారు. డీఎస్సీపై నిరుద్యోగుల్లో ఆందోళన 16 వేల డీఎస్సీ పోస్టుల భర్తీలో అవినీతి జరిగిందంటూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోందని భూమన తెలిపారు. టీటీడీ, యూనివర్సిటీలు, సచివాలయాల్లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలతో పోస్టులు భర్తీ చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు.