తాడేపల్లి: గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా పోలీసులను ప్రయోగించి వారి ఆందోళనను అడ్డుకోవడం సరికాదని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, శాంతియుతంగా నిరసన తెలిపే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సరికాదని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినా పరిష్కారం రాలేదని, అందుకే ఉద్యోగులు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యోగుల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు అరెస్టులు, బైండోవర్‌లు, కేసులు, సస్పెన్షన్లు వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులపై పని భారం పెరిగిందని, సెలవు రోజులు, పండుగ రోజులు, పని సమయం తర్వాత కూడా విధులు నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. రేషనలైజేషన్ పేరుతో 30 వేలకు పైగా ఉద్యోగాలను తగ్గించాలని చూస్తున్నారని, పని ఒత్తిడి భరించలేక ఇప్పటికే వంద మందికిపైగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, లేనిపక్షంలో రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కలిసికట్టుగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... సీఐ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఉద్యోగులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి ధర్నా చౌక్‌కు వస్తే వారిని ఎందుకు అడ్డుకోవాలి? ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కాదా? వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఇదే ఆందోళన సందర్భంగా నున్న సీఐ షేక్ అహ్మద్ అలీ మృతి చెందిన ఘటనపై కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళ్లిన సీఐని బందోబస్తు విధులకు పిలిపించారని, ఎండలో విధులు నిర్వహించిన కారణంగానే ఆయన అస్వస్థతతకు గురై మృతి చెందారని మా దగ్గర సమాచారం ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జరిగిన నిరసన ఒక విషాదకర ఘటనకు దారితీసిన నేపథ్యంలో, దీనికి సంబంధించిన బాధ్యత, పరిస్థితులపై ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్లను వెంటనే ఉపసంహరించాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం పని భారం పెంచడం వెంటనే ఆపాలి. సెలవు రోజులు, పండుగ రోజులు, పని సమయం తర్వాత కూడా అదనపు విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నుంచి విముక్తి కల్పించాలి. ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్లను వెంటనే బేషరతుగా ఉపసంహరించాలి. నిరసన కార్యక్రమాలకు సంబంధించి నమోదు చేసిన కేసులను కూడా తక్షణం రద్దు చేయాలి. ఉద్యోగులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే వారిని భయపెట్టే విధానం కాకుండా, వారిని చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా అణచివేతకు పాల్పడటం సరైన విధానం కాదని ప్రభుత్వం గ్రహించాలి. ఉద్యోగుల డిమాండ్లు తక్షణం నెరవేర్చాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలి. వారికి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కల్పించాలి. 21 కేటగిరీల ఉద్యోగులకు శాఖల వారీగా ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలి. రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాల తగ్గింపు ప్రక్రియను తక్షణం నిలిపివేయాలి. ఉద్యోగులపై అదనపు పని భారం తగ్గించాలి. సెలవులు, పండుగలు, పని సమయం తర్వాత కూడా విధులు నిర్వహించే పరిస్థితిని నివారించాలి. ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్లను ఉపసంహరించి, కేసులను రద్దు చేయాలి. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు, పెండింగ్ డీఏలు తదితర హక్కులను ప్రభుత్వం సకాలంలో పరిష్కరించాలి. ఈ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యోగులు, పెన్షనర్లు కలిసి మరింత పెద్ద స్థాయిలో ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వారు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని నలమారు చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.