టెక్కలి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో అచ్చన్నాయుడు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ విమర్శించారు. సోమవారం టెక్కలి వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీతాపురం గ్రామానికి చెందిన మహిళలను ఉపాధి పథకం సమావేశం ఉందని చెప్పి నిమ్మాడకు తీసుకెళ్లి టీడీపీ కండువాలు వేశారని తిలక్ తెలిపారు. జగన్‌తోనే మేమంతా.. వైయస్ఆర్‌సీపీలోనే ఉంటాం తమను మాయమాటలు చెప్పి నిమ్మాడకు తీసుకెళ్లి కండువాలు వేశారని సీతాపురం మహిళలు, పెద్దలు వైయస్ఆర్‌సీపీ కార్యాలయానికి వచ్చి స్పష్టం చేశారని తిలక్ తెలిపారు. సీతాపురంలో ఉన్న ఇళ్ల సంఖ్యకు, 500 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు చూపిస్తున్న ప్రచారానికి పొంతన లేదని పేర్కొన్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని పక్కదారి పట్టించేందుకే కండువాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తిలక్ విమర్శించారు. పెన్షన్ల పేరుతో రాజకీయ డ్రామా రెండున్నరేళ్లుగా పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల పేరుతో హడావుడి చేస్తోందని తిలక్ విమర్శించారు. పెన్షన్ల ప్రయోజనాలను టీడీపీ కార్యకర్తలకు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి, వైయస్ఆర్‌సీపీ నాయకులు సత్తారు సత్యం, తమన్నగారి కిరణ్, కిల్లి అజయ్‌కుమార్, బెండి ఉదయ్, కర్ణిక జీవన్‌రావు, బర్ల కార్తీక్, బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.