అనంతపురం: ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. గ్రామ స్వరాజ్యం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడంతో పాటు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు కల్పించలేదని అన్నారు. విజయవాడలో వేలాది మంది సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన నిరసన చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే సచివాలయ ఉద్యోగులపై పోలీసులతో దాడులు చేయించడం దుర్మార్గమని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదని, ఐఆర్ ఇవ్వలేదని, పెండింగ్ డీఏలు చెల్లించలేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే కూటమి ప్రభుత్వ పెద్దలకు ఎందుకు కోపమని నిలదీశారు. సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.