తాడేపల్లి: గురు పూజోత్సవం రోజున ఉపాధ్యాయులను సన్మానించాల్సిన ప్రభుత్వం.. వారి హక్కులు, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై పోరాటం చేయాల్సిన పరిస్థితిని కల్పించిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన ‘గురు పరిరక్షణ దీక్ష’లో కల్పలతా రెడ్డి, ఇషాక్ బాషా, రామచంద్రారెడ్డి, పాలవలస విక్రాంత్ తదితరులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న మెగా డీఎస్సీ.. తొలి ఏడాదిలోనే అక్రమాలు, అవకతవకలకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు చోటుచేసుకున్న వ్యవహారాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ కాస్తా దగా డీఎస్సీగా మారింది: కల్పలతా రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఉపాధ్యాయులు సంతోషంగా లేరని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులకు ఆర్థికంగా అన్యాయం చేస్తూ, ఇన్-సర్వీస్ టీచర్లపై టెట్ భారం మోపుతున్న ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. సమస్యలు పరిష్కరించకుండా సన్మానాలు వద్దంటూ పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ వేడుకలను బహిష్కరించాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకంతో ప్రారంభించిన మెగా డీఎస్సీ మొదటి ఏడాదిలోనే భారీ కుంభకోణంగా మారిందని పేర్కొన్నారు. మెరిట్ సాధించిన అభ్యర్థులను పక్కనబెట్టి బ్యాక్‌డోర్ ద్వారా పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. డీఎస్సీలో కోట్ల రూపాయల అవినీతికి సంబంధించిన ఆధారాలను వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా ముందుంచారని తెలిపారు. డీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం నిజాయితీగా సీనియర్ అధికారితో విచారణ జరిపించి చర్యలు తీసుకుని ఉంటే దీనిని మెగా డీఎస్సీ అని పిలిచే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ఇది పక్కా దగా డీఎస్సీగా మారిందని చెప్పారు. జనరల్ డీఎస్సీలో నవీన్ అనే అభ్యర్థి మెరిట్‌లో ఉన్నప్పటికీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమాచారం ఇవ్వకుండా అన్యాయం చేశారని కల్పలతా రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీఈఆర్‌టీలో పనిచేసిన నవీన్ ద్వారా పేపర్ లీక్ వ్యవహారాలు సాగాయనే అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం దీనిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. స్పోర్ట్స్ కోటాలో 80 శాతానికి పైగా నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టారని చెప్పారు. కర్నూలుకు చెందిన ప్రభాకర్ గౌడ్‌కు టెట్ అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా పోస్టు కేటాయించారని తెలిపారు. 2014-15 ప్రకాశం జిల్లా హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో గుంటూరు జట్టే లేకపోయినా థర్డ్ ప్లేస్ వచ్చినట్లు చూపించి ఒక అభ్యర్థికి నకిలీ సర్టిఫికెట్‌తో పోస్టు ఇచ్చారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు మార్చి అర్హులకు తీరని అన్యాయం చేశారని, డీఎస్సీ కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. నవీన్‌కు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?: ఇషాక్ బాషా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించి, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా స్పష్టం చేశారు. సమాజానికి దిక్సూచిగా నిలిచే గురువులను రక్షించుకోవడానికి ‘గురు పరిరక్షణ దీక్ష’ చేపట్టాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరమన్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ నియామకాల్లోనూ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కుమార్‌కు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సెలెక్షన్ లిస్టులో పేరు ఎందుకు పెట్టలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నవీన్ కోర్టుకు వెళ్లిన తర్వాత అతని ఐడీని బ్లాక్ చేసి, ఐదు రోజుల తర్వాత మెయిల్ పంపి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదని చెప్పడం పచ్చి మోసం కాదా అని నిలదీశారు. అధికారులను అడ్డం పెట్టుకుని తప్పుడు కారణాలతో నవీన్‌కుమార్‌కు ఉద్యోగం ఎందుకు నిరాకరించారో ప్రభుత్వం వెల్లడించలేదన్నారు. స్పోర్ట్స్ కోటాలో విచ్చలవిడిగా అవకతవకలు చేసి అనర్హులకు పోస్టులు కట్టబెట్టారని ఇషాక్ బాషా తెలిపారు. కూటమి ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎంపీ భరత్ ఇచ్చిన సర్టిఫికెట్లకు ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. టెట్, డీఎస్సీకి అర్హత సాధించని వారికి అడ్డగోలుగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తును ఏం చేయదలిచారని నిలదీశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వ్యక్తి రేపు విద్యార్థులను ఎలా పాస్ చేయగలడని ప్రశ్నించారు. జీవో నంబర్ 4, 47లను అడ్డం పెట్టుకుని టెట్, డీఎస్సీ అవసరం లేదంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, తప్పు బయటపడిన వెంటనే 26-27 రోజుల్లో జీవో నంబర్ 36 ద్వారా పాత జీవోలను రద్దు చేయడం మోసానికి నిదర్శనమని అన్నారు. డీఎస్సీ పోస్టులకు సంబంధించి రూ.20 లక్షలు, రూ.25 లక్షల రేట్లు మాట్లాడిన ఆడియో టేపులు బయటకు వచ్చినా లోకేష్ సమాధానం చెప్పడం లేదని ఇషాక్ బాషా పేర్కొన్నారు. శాసన మండలిలో ముఖాముఖిగా నిలదీసినా సమాధానం చెప్పే ధైర్యం చేయలేదన్నారు. ఏపీపీఎస్సీ విచారణకైనా సిద్ధమని చెప్పామని, తప్పు లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని, లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. 16 వేల పోస్టులకు 16 వేల ఆరోపణలు: రామచంద్రారెడ్డి డీఎస్సీ నియామకాల్లో 16 వేల పోస్టులకు 16 వేల ఆరోపణలు వెల్లువెత్తాయని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రభుత్వం అవార్డులు ఇచ్చే పరిస్థితి పోయి, ఎమ్మెల్సీలంతా నిరాహార దీక్ష చేయాల్సి రావడం విచారకరమన్నారు. శాసన మండలిలో నాలుగు రోజుల పాటు డీఎస్సీ అక్రమాలపై చర్చ పెట్టాలని నిలదీసినా ప్రభుత్వం తప్పించుకుందని చెప్పారు. మండలిలో వైయస్ఆర్‌సీపీకి మెజారిటీ ఉందని, వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో చర్చ జరపకుండా పారిపోయారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటాలో జరిగిన మోసాలను ఆధారాలతో సహా పత్రికా ముఖంగా బయటపెడుతున్నామని తెలిపారు. ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి అపీల్ చేయడానికి వచ్చిన ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. చదువు చెప్పే నిజాయితీపరులైన ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ, రోడ్లపై తిరిగే వారిని బడులకు పంపిస్తారా అని ప్రశ్నించారు. 2019లో వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో కేవలం మూడు నెలల్లోనే లక్షా 26 వేల సచివాలయ పోస్టులను ఒక్క చిన్న ఆరోపణ లేకుండా భర్తీ చేశామని రామచంద్రారెడ్డి గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం 16 వేల పోస్టులకే 16 వేల ఆరోపణలు ఎదుర్కొంటూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. మెరిట్‌తో వచ్చిన నిజమైన అభ్యర్థులను పక్కనబెట్టి చేసిన అక్రమ నియామకాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మెగా రిక్రూట్‌మెంట్ పేరుతో సాగిన ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు లేదా సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరగాలని తెలిపారు. అన్యాయంగా ఉద్యోగాలు కోల్పోయిన అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీ, ఐఆర్, డీఏలు ఇస్తామని ఉపాధ్యాయులను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారని అన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను ప్రభుత్వం బేషరతుగా వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయుల హక్కులతో పాటు డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. లోకేష్ రాజీనామా చేసి సీబీఐ విచారణను ఎదుర్కోవాలి: పాలవలస విక్రాంత్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేసి సీబీఐ విచారణను ఎదుర్కోవాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఉపాధ్యాయ వ్యవస్థను రక్షించుకోవడానికే శాసన మండలి సభ్యులంతా ఈ దీక్ష చేపట్టామని చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున పాఠశాలల్లో పండుగ వాతావరణం ఉండాల్సింది పోయి ఉపాధ్యాయుల హక్కుల కోసం దీక్షలు చేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన అస్తవ్యస్త విధానాలతో ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. 2019-2024 మధ్య వైయస్ జగన్ తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను దేశంలోని విద్యావేత్తలు ప్రశంసించారని, అలాంటి ఆదర్శవంతమైన విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే నిర్వీర్యం చేసిందన్నారు. భవిష్యత్ తరాల ఆకాంక్షలను కాలరాస్తూ విద్యాశాఖలో అక్రమాలు, అవినీతికి తెరలేపారని పాలవలస విక్రాంత్ పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో అర్హులకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరగాల్సిందేనన్నారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అన్ని అవకతవకలపై బేషరతుగా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ కొనసాగితే నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పారదర్శకమైన విచారణ కోసం లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ ఎత్తిచూపిన ప్రతి అక్రమం, చూపించిన ప్రతి ఆధారంపై సమగ్ర దర్యాప్తు జరగాలని పాలవలస విక్రాంత్ అన్నారు. కష్టపడి చదివి అర్హత సాధించినప్పటికీ అన్యాయానికి గురైన నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. సీబీఐ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు వైయస్ఆర్‌సీపీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.