తాడేపల్లి: గురువులను స్మరించుకోవడమే కాదు.. గురువులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి విధి అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురు పరిరక్షణ దీక్షలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాలను చూస్తే గురువుల్లో కూడా నకిలీలను తీసుకొచ్చిన విషయం స్పష్టమవుతోందన్నారు. భావితరాలకు వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం డీఎస్సీతో శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. కోట్ల కక్కుర్తితో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం నారా లోకేష్ కోట్లకు కక్కుర్తి పడి చేసిన అక్రమాల పాపం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని కురసాల కన్నబాబు అన్నారు. ఉపాధ్యాయులు భావితరాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత కలిగినవారని, అలాంటి పోస్టుల్లోనే నకిలీలకు చోటు కల్పిస్తే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. గురువుల వ్యవస్థను కలుషితం చేసే ఇలాంటి చర్యలు భావితరాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని స్పష్టం చేశారు. ఆధారాలతో నిరూపించినా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదు డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన కూడా లేదని కురసాల కన్నబాబు అన్నారు. ఇన్ని ఆధారాలు, ఇన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన స్పష్టం చేశారు.