తాడేపల్లి: ‘మేం తప్ప ఎవరూ మెగా డీఎస్సీ నిర్వహించలేరు’ అంటూ చంద్రబాబు, నారా లోకేష్ గొప్పలు చెప్పుకున్నారని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. గురు పరిరక్షణ దీక్షలో ఆమె మాట్లాడుతూ తమకంటే గొప్పగా ఎవరూ లేరన్నట్టుగా విర్రవీగిన కూటమి నేతలకు మెగా డీఎస్సీ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు. తీరా చూస్తే మెగా డీఎస్సీ మొత్తం అక్రమాల పుట్టగా తేలిపోయిందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు అక్రమాలే నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు అడుగడుగునా అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే ఎన్నో ఆధారాలను వైయస్ఆర్‌సీపీ ప్రజల ముందుంచిందని తానేటి వనిత తెలిపారు. నిజాయితీగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. డీఎస్సీపై వస్తున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే ధైర్యం లేక టీచర్లను బలవంతంగా తీసుకొచ్చి మీడియాలో మాట్లాడిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం టీచర్లతో బలవంతంగా ధర్నాలు చేయిస్తోందని పేర్కొన్నారు. యువగళంలో పాల్గొన్న వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలా? యువగళం కార్యక్రమంలో తనతో కలిసి పాల్గొన్న వారికి నారా లోకేష్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారని తానేటి వనిత పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకత పాటించామని చెప్పుకునే ప్రభుత్వం.. ఈ వ్యవహారంపై ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని అన్నారు. డీఎస్సీపై వెలుగులోకి వస్తున్న ప్రతి అంశంపైనా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని తానేటి వనిత స్పష్టం చేశారు.