తాడేపల్లి: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాల వ్యవహారం రోజురోజుకూ మరింత బట్టబయలవుతోందని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని, అవి కూటమి ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని తెలిపారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించాల్సి ఉండగా.. స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తోందని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను ఎందుకు అణచివేస్తున్నారు? డీఎస్సీ నియామకాల అక్రమాలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంతో పాటు కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులకు సంబంధించిన పోస్టులు, ఖాతాలను మెటా సామాజిక మాధ్యమాల్లో నియంత్రిస్తున్నారని వైయస్ జగన్ పేర్కొన్నారు. ‘చట్టపరమైన ఆదేశాలు’ అంటూ పోస్టులను తొలగించడం, జియోబ్లాక్ చేయడం జరుగుతోందని తెలిపారు. సాక్షి టీవీ, సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్‌తో పాటు డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నిస్తున్న వ్యక్తిగత ఖాతాలు కూడా ఈ ఆంక్షల బారిన పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు, నిరంకుశత్వం, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారని వైయస్ జగన్ అన్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రశ్నించిన వారి గొంతు నొక్కడం పరిపాలన కాదని, ఇది నియంతృత్వ సెన్సార్‌షిప్ అని పేర్కొన్నారు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని, రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షం, మీడియా, సామాజిక కార్యకర్తలు, పౌరుల గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని స్పష్టం చేశారు. ప్రశ్నలకా భయం.. సమాధానాలకా? చంద్రబాబును ఉద్దేశించి వైయస్ జగన్ పలు ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ నియామకాల్లో ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్న ఆధారాలు అవాస్తవమైతే ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించాలని కోరారు. ఆ పని చేయకుండా సీబీఐ విచారణను ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నించారు. అక్రమాలను బయటపెడుతున్న వారి గొంతును ఎందుకు అణచివేస్తున్నారని, వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు నియంత్రిస్తున్నారని నిలదీశారు. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవని, ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరని వైయస్ జగన్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని, ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాలని, రాజ్యాంగబద్ధంగా పాలించాలని సూచించారు. డీఎస్సీ రాయకుండానే ఉద్యోగాలా? డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌లో ఉత్తీర్ణులు కాకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం తన చర్యలను ఎలా సమర్థించుకుంటుందని వైయస్ జగన్ ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా భర్తీ కోసం కొత్తగా జీవోలు జారీ చేసి, నియామకాలు పూర్తయిన తర్వాత వాటిని రద్దు చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ జీవోల ద్వారా నియమితులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని తెలిపారు. అక్రమ నియామకాలకు ముందు గేట్లు తెరిచి, నియామకాలు పూర్తయ్యాక వాటిని మూసివేయడం అవినీతిని సూచించడం కాదా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఆదేశించండి నియంత్రించిన ప్రతి సామాజిక మాధ్యమ ఖాతా, పోస్టు, కంటెంట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని వైయస్ జగన్ కోరారు. సామాజిక మాధ్యమాలపై సెన్సార్‌షిప్‌ను నిలిపివేయడంతో పాటు ప్రజలు, ప్రతిపక్షం, మీడియా లేవనెత్తుతున్న అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాలని పేర్కొన్నారు. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని వైయస్ జగన్ సవాల్ చేశారు. స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చాలని, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమ ఖాతాలను వెంటనే పునరుద్ధరించడం, సెన్సార్‌షిప్‌ను ఆపడం, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం, డీఎస్సీపై సీబీఐ విచారణకు ఆదేశించడం తక్షణం జరగాలని వైయస్ జగన్ పేర్కొన్నారు. అన్నీ పారదర్శకంగా జరిగి, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.