డీఎస్సీ అక్రమాలు బయటపడుతుంటే ప్రభుత్వ వెన్నులో వణుకు

అందుకే మీడియా, సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేస్తున్నారు

నియంతృత్వ, అణిచివేత ధోరణితో వాస్తవాలను దాచలేరు

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ధ్వజం

​తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, ఫేక్‌ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఒక్కొక్క నిజం బయటకు వస్తుండటంతో కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు మొదలైందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ధ్వజమెత్తారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలు ప్రజలకు తెలియకుండా సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేయడం, వీడియోలను తొలగించడం ద్వారా నిజాలను అణచివేయలేరని స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్‌ జగన్‌ వాస్తవాలను ప్రజల ముందుంచిన తర్వాత మంత్రి నారా లోకేశ్‌ తనతో చర్చకు రావాలంటూ సవాళ్లు చేశారని పుత్తా శివశంకర్‌ గుర్తుచేశారు. ఒకటోసారి, మూడోసారి, ఐదోసారి అంటూ.. పులివెందుల వస్తా, తాడేపల్లి వస్తా అంటూ ప్రగల్భాలు పలికిన లోకేశ్‌.. ఇప్పుడు వాస్తవాలు, ఆధారాలు బయటపడుతుండటంతో కాచే చెట్లకు రాళ్లంటూ సామెతలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా బయటపడుతున్న ఆధారాలకు నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేసి, సీబీఐతో దర్యాప్తు చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు.

చిన్నపాటి సోషల్‌ మీడియా పోస్టులకే కేసులు పెట్టే ప్రభుత్వం.. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న ఖాతాలను ఎందుకు బ్లాక్‌ చేస్తోందని పుత్తా శివశంకర్‌ ప్రశ్నించారు. కంటెంట్‌ తప్పయితే ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి ఆధారాలతో సమాధానం చెప్పాలని, ప్రభుత్వానికి నిజంగా అభ్యంతరం ఉంటే ఏ పోస్టు తప్పో, దానికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందు పెట్టాలని అన్నారు. ప్రభుత్వం మెటాకు పంపిన ఫిర్యాదులు, అందులో పేర్కొన్న అభ్యంతరకర కంటెంట్‌ వివరాలను కూడా బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

డీఎస్సీలో అర్హతలు లేని అభ్యర్థులు, ఫేక్‌ సర్టిఫికెట్లు సమర్పించిన వారు, టెట్‌లో అర్హత సాధించని వారికి కూడా ఉద్యోగాలు కల్పించారన్న అంశాలు వెలుగులోకి వస్తుండటంతో ప్రభుత్వం అణిచివేత ధోరణిని అవలంబిస్తోందని విమర్శించారు. స్పోర్ట్స్‌ కోటాలో టీచర్‌ పోస్టులకు ఎంపికైనట్లు చెబుతున్న 382 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను బహిరంగంగా పరిశీలించి, అవి అసలైనవో కాదో తేల్చి నిజానిజాలను ప్రజల ముందుంచాలని కోరారు. సర్టిఫికెట్లు నిజమైనవైతే ప్రజల ముందుకు తీసుకురావడానికి భయమెందుకని ప్రశ్నించారు.

డీఎస్సీపై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్న సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేసినంత మాత్రాన నిజాన్ని బ్లాక్‌ చేయలేరని పుత్తా శివశంకర్‌ స్పష్టం చేశారు. ఒక వీడియోను తొలగించినంత మాత్రాన ప్రజలకు తెలిసిన విషయాలను చెరిపేయలేరన్నారు. సోషల్‌ మీడియాను ఎంత అణచివేసినా డీఎస్సీ వ్యవహారంపై ప్రజల్లో మొదలైన చర్చ ఆగదని పేర్కొన్నారు. గతంలో తిరుమల లడ్డూ వ్యవహారంలోనూ ఇదే తరహా ధోరణిని అవలంబించారని గుర్తుచేశారు.

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబితే ఆధారాలతో నిరూపించాలని, ఫేక్‌ సర్టిఫికెట్లు లేవంటే అధికారికంగా ప్రకటించాలని పుత్తా శివశంకర్‌ అన్నారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. డీఎస్సీ వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించి, సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు.

సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని, మెటాను కూడా సంప్రదిస్తామని పుత్తా శివశంకర్‌ తెలిపారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయపరమైన సహకారం అందిస్తుందని చెప్పారు. ఇకనైనా డీఎస్సీ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరారు.

Back to Top