తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్) మోహరించాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు లేఖ రాశారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలు, అధికార యంత్రాంగం దుర్వినియోగం, అధికార పార్టీకి చెందిన వ్యక్తుల జోక్యం, బెదిరింపుల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాల భద్రత అవసరమని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. అలాగే గతంలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన ఆధారాలు, వైయస్ఆర్‌సీపీ చేసిన ఫిర్యాదులను సైతం అప్పిరెడ్డి తన లేఖకు జత చేశారు. ఎస్ఈసీకి రాసిన లేఖలో లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్న అంశాలు కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి అనధికారికంగా ప్రవేశించడం, పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లను బెదిరించడం, పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కల్పించడం, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. చిన్నకొట్టపల్లి పోలింగ్ బూత్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఇతర రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారు. మంత్రి సమక్షంలో వైయస్ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్‌పై భౌతిక దాడి చేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు. అలాగే 2025 ఆగస్టు 7న నాగులదిన్నెవారిపల్లె గ్రామంలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, పార్టీ నేత వెలుపుల రామలింగారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. వాహనాలను ఇనుపరాడ్లు, ఇతర ఆయుధాలతో ధ్వంసం చేశారు. ఒక ఇంటికి నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. 2025 ఆగస్టు 13న పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లోని సుమారు 15 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను బెదిరించడం, రిగ్గింగ్, పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించడం వంటి ఘటనలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి చెందిన వ్యక్తుల జోక్యం, బెదిరింపులు, ప్రలోభాలు, దాడులు, అధికార యంత్రాంగం దుర్వినియోగంపై ఫిర్యాదులు వచ్చాయి. తుని, పిడుగురాళ్ల, పాలకొండ మున్సిపాలిటీల్లో ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తునిలో ఎన్నికల ప్రక్రియ గతంలో రెండు సార్లు వాయిదా పడింది. 2025 ఫిబ్రవరి 17న కూడా ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్ల ఇళ్లపై దాడులు జరిగాయి. కౌన్సిలర్లను బెదిరించేందుకు కొందరు పోలీసు సిబ్బంది అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో కుమ్మక్కయ్యారు. పిడుగురాళ్లలో వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్ల ఇళ్లను కూల్చివేయడం, బెదిరింపులకు పాల్పడ్డారు. పాలకొండలో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానానికి చెందిన ఏకైక వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్‌ను భయపెట్టి, బెదిరించడంతో ఎన్నిక వాయిదా పడింది. కాబట్టి, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ, వార్డు స్థాయిలో రాజకీయ పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష అభ్యర్థులపై బెదిరింపులు, నామినేషన్ల దాఖలాకు అడ్డంకులు, ఓటర్లను ప్రభావితం చేయడం, పోలింగ్ ఏజెంట్లపై ఒత్తిడి, స్థానిక అధికార యంత్రాంగం దుర్వినియోగం వంటి చర్యలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పోలింగ్ రోజున మాత్రమే కాకుండా నామినేషన్లు, నామినేషన్ల ఉపసంహరణ, ప్రచారం, ఎన్నికల సామగ్రి రవాణా, స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత వంటి కీలక దశల్లో కూడా కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాలి. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ తగిన భద్రతా చర్యలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన సంఖ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రప్పించి మోహరించేందుకు చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ, ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు అందరికీ సమాన అవకాశాలు కల్పించి, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.