తిరుపతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులతో రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డప్ప, భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, కృపాలక్ష్మి, వైయస్ఆర్‌సీపీ నేత వజ్ర భాస్కర్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. “వైయస్ఆర్‌సీపీ ఒక బ్రాండ్. ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు కూడా అందుతాయి. ఓట్లు వేసిన ప్రజలను చంద్రబాబు వెన్నుపోట్లతో పొడుస్తూనే ఉన్నాడు. నమ్మకద్రోహం చేస్తూ, అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడు. పచ్చ మీడియా, కూటమి మోసాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కార్యకర్తలందరూ క్రియాశీల కార్యకర్తలుగా పనిచేయాలి. వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్ర కూడా మొదలవుతుంది. ఆలోపే మనమంతా సమిష్టిగా పనిచేద్దాం. పరస్పర చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందాం” అని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ.. “స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్వేలో మొదటి స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో అందరం సమిష్టిగా పనిచేసి, పార్టీని గెలిపించుకుందాం” అని అన్నారు. మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. “వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేశారు. రాష్ట్రంలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. అనర్హులకు డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పాలనలో కరువు వచ్చింది. ఈవీఎంలు మేనేజ్ చేసుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది” అని అన్నారు.