తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రైతులను పూర్తిగా గాలికొదిలేసిందని, ఫీడ్ కంపెనీలతో కుమ్మక్కై ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతూ రైతుల నడ్డివిరుస్తోందని వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, తాడేపల్లిగూడెం సమన్వయకర్త వడ్డీ రఘురాం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆక్వా రంగాన్ని కాపాడేందుకు తెచ్చిన పటిష్టమైన అప్సడా చట్టాన్ని కూటమి పాలకులు నిర్వీర్యం చేశారని, దీంతో నాణ్యత లేని సీడ్, ఫీడ్ వల్ల తెగుళ్లు వ్యాపించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో కృత్రిమ కొరత సృష్టించి ఫీడ్ ధరలను పలుమార్లు పెంచారని, దీనివల్ల పెట్టుబడులు రాక రైతులు చెరువులను వదిలేసి క్రాప్ హాలిడే ప్రకటించే ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు. పెంచిన ఫీడ్ ధరలను తక్షణమే అదుపు చేయకపోతే ఆక్వా రైతుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తుందని, రైతులకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే... రొయ్యలకు వైరస్ లా మారిన చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతుల వెన్ను విరిచిన కూటమి ప్రభుత్వం ముదునూరి ప్రసాదరాజు, పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రొయ్యలకు వైరస్ వస్తే దురదృష్టం అనుకుంటాం.. కానీ చంద్రబాబు ప్రభుత్వం వైరస్‌లా మారి అన్ని రంగాలను సంక్షోభంలోకి నెడుతోంది. కరెంటు కష్టాలు, ఫీడ్ ధరల పెరుగుదల, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రేపు ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వస్తుంది. రైతులు కొనుగోలు చేసిన ఏరియేటర్లు, జనరేటర్లు, ఇతర పరికరాలు ఉపయోగించకపోతే పాడైపోయే పరిస్థితి వస్తోంది. ఫీడ్ కంపెనీలకు ముడిసరుకుల ధరలు పెరిగితే కేంద్రం నుంచి ఫిష్‌మీల్, సోయా వంటి ముడిసరుకులపై ప్రోత్సాహకాలు ఇప్పించి ఆ భారాన్ని రైతులపై పడకుండా ప్రభుత్వం చూడాలి. ఫీడ్ కంపెనీల సమస్యలను పరిష్కరించడంతో పాటు రైతులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 40 శాతం ఎకానమీ ఇస్తున్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. గతంలో వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రూపాయిన్నరకే కరెంటు ఇచ్చి, అప్సడా చట్టాన్ని తెచ్చి నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా వ్యవస్థను కాపాడారు. రైతు భరోసా కేంద్రాల్లో ఆక్వా అసిస్టెంట్లను నియమించి, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ను, పశ్చిమ గోదావరిలో అంతర్జాతీయ స్థాయి ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఘనత జగన్ గారిదే. ఈ కూటమి పాలనలో గడచిన 30-40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్లపై రొయ్యలు, ఫీడ్ పోసి తగలబెట్టే దుస్థితి దాపురించింది. రూపాయిన్నరకే విద్యుత్ అని ప్రచారం చేసుకుంటూనే పవర్ ఫ్యాక్టర్, ఓవర్ లోడ్ చార్జీల పేరుతో రైతుల నుంచి వందల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు ఫీడ్ ధరలు పెంచారు, ఎన్నికల నాటికి టన్ను రూ.80 వేలు ఉన్న ఫీడ్ నేడు రూ.1,20,000కు చేరింది. ఇటీవల రెండు రూపాయలు తగ్గించామని చెప్పి, నెల రోజులు గడవక ముందే మళ్లీ కేజీకి 12 రూపాయలు పెంచడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఫీడ్ యాజమాన్యాలు ఇచ్చే ముడుపులకు ఆశపడి కూటమి ప్రభుత్వం వారి పక్షాన నిలబడి చిన్న, సన్నకారు రైతుల గొంతు కోస్తోంది. సీడ్ క్వారంటైన్ కేంద్రాలపై ప్రభుత్వ నిఘా లోపించడం వల్లే నాసిరకం సీడ్ మార్కెట్లోకి వచ్చి రాష్ట్రవ్యాప్తంగా తెగుళ్లు వ్యాపించాయి. అప్సడా చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం చేస్తున్న ద్రోహంపై వైయస్ఆర్‌సీపీ తరపున రైతులతో కలిసి న్యాయపోరాటం చేస్తాం. ముసుగు వీరుల ముడుపుల కోసం రైతుల బలి: వడ్డీ రఘురాం తాడేపల్లిగూడెం సమన్వయకర్త, అప్సడా మాజీ వైస్ చైర్మన్ దేశంలోనే ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థం కోసం సర్వనాశనం చేస్తున్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారు సీడ్, ఫీడ్, ల్యాబ్స్, మందుల నియంత్రణకు జ్యుడీషియల్ అధికారాలతో అప్సడా చట్టాన్ని తెస్తే, కూటమి ప్రభుత్వం జీవో 180 ద్వారా దాన్ని నిర్వీర్యం చేసింది. గతంలో కేజీకి రూ.2.85 పెరిగితేనే జే-టాక్స్ అన్న నాయకులు, ఇప్పుడు టన్నుకు రూ.45 వేలు పెంచినందుకు 'సీఎల్పీ' (చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్) టాక్స్ ఎన్ని వేల కోట్లు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, కొన్ని అసోసియేషన్లు సిండికేట్ అయి సాగిస్తున్న దోపిడీకి మంత్రులు, ప్రభుత్వ పెద్దలు వత్తాసు పలుకుతున్నారు. పవర్ ఫ్యాక్టర్ నిబంధన వల్ల రెండు లక్షల హెక్టార్లకు సంబంధించి దాదాపు రూ.1,400 కోట్ల కుంభకోణానికి తెరలేపారు. రైతులకు ఇచ్చిన విద్యుత్ సబ్సిడీపై మంత్రులు నోటికొచ్చినట్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు తప్ప వాస్తవంగా పైసా విదిల్చలేదు. వైయస్ జగన్ హయాంలో కౌంట్ ధరలలో స్థిరత్వం కోసం నిర్దిష్ట కాలపరిమితి నిబంధనలు పెడితే, నేడు దళారులు ఇష్టారాజ్యంగా రేట్లు తగ్గిస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఆక్వా రైతులకు వైయస్ జగన్ హయాంలో ఇచ్చిన భరోసా ఇప్పుడేమైంది? 169 జీవోలో పవర్ ఫ్యాక్టర్‌ను 0.90 నుంచి 0.94కు పెంచాలని నిర్ణయిస్తే.. దాన్ని వైయస్ జగన్ వ్యతిరేకించడంతో రద్దు చేస్తామని చెప్పారు. మళ్లీ అదే జీవోను 57 జీవోగా మార్చారు. మీ చిత్తశుద్ధి ఏది? రూ.1,200 కోట్లు సబ్సిడీ ఇచ్చామని చెబుతున్నారు. జూన్ 1 నుంచి అమలు అన్న మీరు.. జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల్లో ఆక్వా రైతులకు ఎంత సబ్సిడీ ఇచ్చారో దమ్ముంటే చెప్పండి. ఇప్పటివరకు పైసా సబ్సిడీ ఇవ్వలేదని మేం చెబుతున్నాం. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. బిల్లులు కట్టకుండా ఉండండి.. మీ వెనుక వైయస్ఆర్‌సీపీ, వైయస్ జగన్ ఉన్నారు. వైయస్ జగన్ హయాంలో 1–10, 10–20, 20–30/31 వరకు ఉన్న పీస్ వైజ్ రేట్లను స్థిరంగా ఉంచి రైతులకు నష్టం రాకుండా చూశాం. ఇప్పుడు ఆ విధానాన్ని తుంగలో తొక్కారు. కౌంట్‌కు పీస్‌వైజ్ రేటు పెంచాలని చెబితే.... ప్రభుత్వం రైతులకు ప్రయోజనం కల్పించే చర్యలు తీసుకోవడం లేదు. చేపల రవాణాపై అస్సాం, మిజోరం వంటి ఇతర రాష్ట్రాల్లో సమస్య వచ్చినప్పుడు వైయస్ జగన్ జోక్యం చేసుకుని వెంటనే స్పందించి 24 గంటల్లో సమస్యను పరిష్కరించారు. పరీక్షలు చేయించి ఆంధ్రప్రదేశ్ చేపల్లో నిషేధిత కెమికల్స్ లేవని నిరూపించాం. ఆక్వా, చేపల రైతుల కోసం జగన్ ప్రభుత్వం చేసిన పనులు రైతులు మర్చిపోలేదు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జగన్ విమర్శించడం కాదు.. మీరు రైతులకు నిజంగా ఏం చేశారో చెప్పండి. గతంలో ఇతర రాష్ట్రాల్లో మన చేపలపై సమస్యలు వస్తే 24 గంటల్లో జగన్ గారు స్వయంగా అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరించుకోవాలి, పవర్ ఫ్యాక్టర్ నిబంధనలను రద్దు చేయాలి. ఆక్వా రైతుల వెనుక వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది, రైతుల సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వం మెడలు వంచుతాం.