కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత

మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ

 
విజయనగరం : స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరంలో జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక, విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ పరిపాలన బాగుండేదనే చర్చ జరుగుతోందని బొత్సా సత్యనారాయణ తెలిపారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగాల కోసం విద్యార్థులు, యువత రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని పేర్కొన్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేశామని తెలిపారు. గత ఐదేళ్లలో చేసిన మంచి పనులను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలకు గుర్తింపుగా ఐడీ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ, వైఎస్ జగన్ హయాంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి ప్రజలు మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపు 2029 సార్వత్రిక ఎన్నికలకు పునాది వేస్తుందని బొత్సా సత్యనారాయణ తెలిపారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాప్రతినిధుల పనితీరు, సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు.

సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పరిశీలకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగాల నాయకులు, మహిళా కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు, వైయ‌స్ఆర్‌సీపీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


 

Back to Top