నెల్లూరు: రీవెరిఫికేషన్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను మండలాల వారీగా ప్రజల ముందు పెట్టాలని నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రీవెరిఫికేషన్ పేరుతో భూముల రిజిస్ట్రేషన్లను ఫ్రీజ్ చేసి గత 27 నెలలుగా పేద రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందన్నారు. వైఎస్ జగన్ గారు పేద రైతులకు భూములపై యాజమాన్య హక్కులు కల్పించేలా తీసుకొచ్చిన భూ సంస్కరణలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసి, ఇప్పుడు అదే హక్కులను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రీవెరిఫికేషన్‌లో భాగంగా ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని తిరస్కరించబడ్డాయి, ఎన్ని అప్పీల్స్ ఆమోదం పొందాయి, ప్రజాప్రతినిధుల నుంచి ఎన్ని సిఫార్సులు వచ్చాయో ప్రజలకు చెప్పాలని, మండలాల వారీగా, జిల్లాల వారీగా పూర్తి డేటాను బహిరంగపరచాలని ఆయన డిమాండ్ చేశారు. రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందుంచారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... వైఎస్ జగన్ భూ సంస్కరణలనే కొనసాగిస్తూ.. చంద్రబాబు క్రెడిట్ చోరీ వైఎస్ జగన్ గారు పేదవాడికి భూమిపై సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించాలనే ఆలోచనతో భూ సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు అసైన్‌దారు లేదా అతని చట్టబద్ధ వారసులు 20 సంవత్సరాలుగా భూమిని అనుభవిస్తూ, వారి పేర్లతో రికార్డులు ఉంటే వారికి యాజమాన్య హక్కులు కల్పించే విధానం తీసుకొచ్చాం. వీఆర్వో, తహసీల్దార్ స్థాయిలో నూటికి నూరు శాతం రికార్డులు, భూమి, అనుభవదారుడిని వెరిఫై చేయాలని.. ఆర్డీవో స్థాయిలో 10 శాతం భూములను పరిశీలించేలా స్పష్టమైన విధానం పెట్టాం. అయినా వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో వెరిఫికేషన్ జరగలేదని సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 27 నెలలు కాలయాపన చేసి, అదే విధానాన్ని కొనసాగిస్తూ తామే పేదలకు హక్కులు కల్పిస్తున్నట్లుగా చెప్పుకోవడం క్రెడిట్ చోరీ తప్ప మరొకటి కాదు. వైఎస్ జగన్ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలను వెంటనే అమలు చేసి, అర్హులైన పేద రైతులకు వారి భూములపై హక్కులు కల్పించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదవాడి పక్షాన నిలబడి చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తే, సీఎం చంద్రబాబు మాత్రం ఆ హక్కులను కాలరాస్తూ రైతులను రోడ్డున పడేశారు. వైఎస్ జగన్ గారికి మంచి పేరు రాకూడదనే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే రీవెరిఫికేషన్ పేరుతో రిజిస్ట్రేషన్లను ఫ్రీజ్ చేసి, గత 27 నెలలుగా పేద రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. గత వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అధికారులే నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి భూములను సుమోటోగా 22ఏ నుంచి తొలగించి శాశ్వత పట్టాలు అందజేస్తే, సీఎం చంద్రబాబు మాత్రం కక్షగట్టి ఆ ప్రక్రియను అడ్డుకున్నారు. కేవలం వైఎస్ జగన్ గారి మంచి పేరు వస్తుందనే దుర్మార్గపు ఆలోచనతోనే, ఈ రెండేళ్ల కాలంలో పేదల ఆస్తులపై హక్కులు లేకుండా చేసి, వారిని మళ్లీ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే దుస్థితికి నెట్టేశారు. మండలాల వారీ డేటాను ప్రభుత్వం బహిరంగపరచాలి రీవెరిఫికేషన్‌లో భాగంగా ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని తిరస్కరించబడ్డాయి అనేది పూర్తి స్థాయిలో మండలాల వారీ డేటాను ప్రభుత్వం బహిరంగపరచాలి. సీఎం చంద్రబాబు చెప్పే లెక్కలకు, రెవెన్యూ మంత్రి చెప్పే దానికి మధ్య లక్షల ఎకరాల తేడా ఉండటమే ఈ ప్రభుత్వ మోసానికి నిదర్శనం. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదు కాబట్టే, క్షేత్రస్థాయిలో మళ్లీ మధ్యవర్తుల జోక్యం పెరిగి రైతులు ఏసీబీని ఆశ్రయించాల్సిన పరిస్థితులు వచ్చాయి. వైఎస్ జగన్ గారు ప్రతిష్టాత్మకంగా తెచ్చిన భూ సంస్కరణల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15.21 లక్షల మంది పేద రైతులకు 27.41 లక్షల ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు దక్కాయి. కానీ, సీఎం చంద్రబాబు మాత్రం తన జీవితాంతం అబద్ధాలతోనే కాలం గడుపుతూ, తామే కొత్తగా ఏదో చేశామని చెప్పడానికి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. పేదల సంక్షేమాన్ని విస్మరించి, కేవలం రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వ పథకాలపై బురదజల్లుతున్నారే తప్ప, పేదవాడికి భూమిపై శాశ్వత భద్రత కల్పించాలనే మనసు వీరికి ఎప్పటికీ రాదు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు, కాలయాపన చర్యలు మాని, వైఎస్ జగన్ గారు అమలు చేసిన మంచి విధానాలను కొనసాగించి పేద రైతులను ఆదుకోవాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆగ్రహాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.