నెల్లూరు: మహిళలను తాను ఎప్పుడూ అగౌరవంగా మాట్లాడలేదని, ప్రశాంతమ్మను రాజమాత అని సంబోధించానని, అది తప్పుగా అనిపిస్తే తన తల్లి వయసు ఉన్నందున పెద్దమ్మ అని పిలవడంలో తప్పేముందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. “ప్రెస్‌మీట్‌లో మీరు చెప్పిన అబద్ధాలకు సమాధానం చెప్తున్నా. ఇప్పటివరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై పూర్తి ఆధారాలతోనే మాట్లాడా. లక్ష్మీ క్వార్ట్జ్ కంపెనీ పెట్టి ఎంతమందిని ముంచారో మాకు తెలుసు. అప్పట్లో మా పిలక లేడు కాబట్టి అతని గురించి మాట్లాడను. ఆ తర్వాత ఫిని క్వార్ట్జ్ పెట్టారు. అందులో మీ అనుచరులే డైరెక్టర్లుగా ఉన్నారు. అది కూడా ట్రేడింగ్ కంపెనీ. అందులో మా పిలక లేడు. పక్క దేశాల్లో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారని చెప్పా. రమణకుమార్ మీ వాడు కాదా? డవ్‌కు వీఆర్‌పీ లెటర్ ఇచ్చినట్లు చూపించి ప్రశ్నించా.. అయినా సమాధానం లేదు. ఆఫీస్ వాళ్లదే అని ఒప్పుకున్నందుకు సంతోషం. ఇవాళ్టికీ అది ఓపెన్‌లోనే ఉంది. అసలు ఫిని అనే ట్రేడింగ్ కంపెనీ ఎందుకు పెట్టారు? మీ అనుచరుడిపై సిండికేట్ నడిపేందుకే కదా? చిత్తశుద్ధి ఉంటే కంపెనీని ఎప్పుడో మూసేసి ఉండాలి. కానీ సంవత్సరం సమయం తీసుకున్నా మూయలేదు. అవన్నీ చెప్తే మా పెద్దమ్మ నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతోంది. అసలు ఆమెకు సంస్కారం ఉందా?” అని ప్రశ్నించారు. 2014లో అజీజ్‌ను మేయర్ చేసే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో తాము లేమని, వేమిరెడ్డి వద్ద క్యాంపు పెట్టలేదని తెలిపారు. “గోవాలో క్యాంపు పెట్టి ఇక్కడి టీడీపీ నేతలతో కలిసి జంప్ అవ్వాలనుకున్న వ్యక్తి ఎవరు? ఆ రోజు రాత్రంతా శ్రీధర్ రెడ్డితో కలిసి లాబీలో కూర్చున్నాం. మైనార్టీలకు మా అధినేత ఇచ్చిన హామీని నిలబెట్టాలనేది మా ప్రయత్నం. అజీజ్ విషయంలో మీ ఆయన చేసింది సున్నా. అజీజ్ ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఎవరైనా సాయం చేస్తే గౌరవంగా చెప్తాం. కానీ నిన్న నువ్వు దానంగా ఇచ్చామని చెప్పావు. మైనార్టీ సోదరుడికి దానం ఇచ్చామని చెప్పడమే కాకుండా అతన్ని బజారున పడేసిన చరిత్ర నీది. ఇదే మీ డబ్బు అహంకారానికి ఉదాహరణ” అని అన్నారు. “2018లో ఎంపీ టికెట్ ఇప్పించాలని నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన మాట వాస్తవం కాదా? మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దని మా వాడికి చెప్పిన మాట వాస్తవం కాదా? 2019లో నేను డబ్బులు తీసుకున్నానని అన్నారు. అప్పుడు సాయం చేసింది జగన్ గారు.. మీరు కాదు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇంటికి పిలిచి నాకు సాయం చేశారు. అది ఆయనకున్న సంస్కారం. రాజ్యసభ ఎన్నికల సమయంలో వేమిరెడ్డి కోసం టీడీపీ ఎమ్మెల్యేను తీసుకొచ్చి కూర్చోబెట్టింది నేను కాదా? నా జీవితంలో వాళ్ల కాళ్లకు దండం పెట్టిన సందర్భాలు లేవు. శివపార్వతులు అని నేను అన్నట్లు మీరు ప్రమాణం చేయగలరా? ఇస్కాన్ సిటీలో గుడి కట్టిన సైట్ మొత్తం మాది. మా తాతగారు ఇచ్చింది. గుడి నిర్మాణానికి బ్యాంకులో నగదు కూడా మా తాత ఇచ్చారు. మీ బావ దగ్గర మా తండ్రి కొన్న స్థలమే ఇస్కాన్‌లో ఉంది. నా ఆస్తులు నేను అమ్ముకుంటే ప్లాట్లు కబ్జా చేశానని అన్నారు. వాస్తవాలు తెలియకుండా మాట్లాడవద్దు. దొంతాలిలో మా కుటుంబానికి ఎప్పటి నుంచో పొలాలు ఉన్నాయి. 2019లో నన్ను గెలిపించానని చెప్పావు. నువ్వు గెస్ట్‌గా మీటింగ్‌కు వచ్చావు. అయినా నువ్వు చెప్తే ఓట్లు వేసేవాళ్లు ఉన్నారా? 2019లో ఏ రౌండ్‌లోనూ నేను మైనస్‌లోకి వెళ్లలేదు. వాస్తవాలు తెలుసుకో. నేను ఆరోగ్యంగానే ఉన్నా.. నీ కొడుకు కంటే ఫిట్‌గానే ఉన్నా” అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రెస్‌మీట్‌లో 70 మందితో కూడిన జాబితా చూపించారని, తాము జరిమానాలు విధించిన వారి జాబితానే తీసుకొచ్చి చూపించారని పేర్కొన్నారు. “వాళ్ల నుంచి కమిషన్లు దొబ్బేసి అదే జాబితా తెచ్చి చూపించారు. అందులో బద్రి కూడా ఉన్నాడు. అతన్ని అడగండి. అతనికి నాతో సంబంధం ఉంటే దేనికైనా సిద్ధం. తెలిసీ తెలియకుండా మాట్లాడొద్దు. నాలుగు పాస్‌పోర్టులు చూపిస్తున్నా.. వెతుక్కోండి. నేను ఒక్కసారైనా చైనాకు వెళ్లినట్లు నిరూపిస్తే మీ కాళ్లకు దండం పెడతా. పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అయినా విదేశాలకు వెళ్తే తప్పేముంది? నా స్నేహితుల దగ్గరకు వెళ్లా. మేయర్ కాకుండా మేయర్ ఫోటో వేసుకున్నారు. ఇంకా ఆధారాలు బయటకు తీస్తాం. ఇంకా దొరుకుతారు. మీ చరిత్రలు కట్టలు కట్టలుగా ఉన్నాయి. కేసు పెడితే ఆస్తులు జప్తు చేస్తారంటున్నారు. నేను కోరుకుంటున్నా. ఎంక్వైరీ చేయించి నా ఆస్తులు మీరే ప్రకటించి భాగ్యం కట్టుకోండి పెద్దమ్మా. 2029లో ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేస్తా. వీలుంటే అక్కడ నన్ను మీ నోట్ల కట్టలతో పోటీ పడండి” అని సవాల్ చేశారు. “అప్పట్లో వేమిరెడ్డి టచ్‌లోనే ఉన్నారని పాదయాత్రలో లోకేష్ స్వయంగా చెప్పారు. మా బాస్ ఇంకా పాదయాత్ర ప్రారంభించలేదు. అప్పుడే టచ్‌లోకి వెళ్లారంట. మైనార్టీలంటే నేను గౌరవంగా చూస్తా. మీలాగా నోటికి వచ్చినట్లు మాట్లాడను. శాంతినికేతన్ విల్లా కట్టారు. 12 మంది నుంచి తీసుకున్న అడ్వాన్స్ ఇంకా ఇవ్వలేదంట. అందులో మావాళ్లు కూడా కొందరు ఉన్నారు. త్వరగా ఆ డబ్బులు ఇచ్చేయమ్మా. కోటారెడ్డి గారు మాకు సాయం చేసిన మాట వాస్తవమే. కాదు అని నేను చెప్పడం లేదు. కోటారెడ్డి గారు గాంధీబొమ్మ వద్ద సైట్ విషయమై కమిషనర్‌కు లెటర్ పెట్టిన మాట వాస్తవం. అప్పుడు ప్రభుత్వ స్థలం.. ఇప్పుడు రిజిస్టర్ అవ్వగానే మీ స్థలం అవుతుందా? రూప్ వల్ల చెడ్డపేరు వస్తుందని కొందరు ఆమెకు చెప్పగా, అందరూ పోయినా పర్లేదు అతనే కావాలని చెప్పిందంట. వాణ్ణి పక్కన పెడితే మీ గుట్టు రహస్యాలు ఏమీ బయటపడతాయో అనే అనుమానాలు టీడీపీలోనే ఉన్నాయి. శ్రీధర్ అన్న చెప్పిన మాట వింటే బాధేసింది. దెయ్యాలకే వేదాలు చెప్పే టాలెంట్ ఉంది శ్రీధర్ అన్నకు. నేను చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నా” అని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర నాయకుడు ఎండి. ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు మొగళ్లపల్లి కామాక్షీదేవి, ఊటుకూరు నాగార్జున, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, నీలి రాఘవరావు, గుంజి జయలక్ష్మి, నాయకులు మీరా మోహిద్దీన్, అబ్దుల్ మస్తాన్, మద్దినేని శ్రీధర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.