తిరుపతి: నైలెట్‌ను అమరావతికి తరలించడాన్ని నిరసిస్తూ తిరుపతిలో జెన్‌జీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ ర్యాలీకి వేలాదిగా విద్యార్థులు, యువత, నగర ప్రజలు తరలివచ్చారు. “కాక్రోచ్ తిరుపతి” పేరుతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో నైలెట్‌కు శాశ్వత క్యాంపస్ నిర్మించాలని డిమాండ్ చేశారు. నైలెట్ వంటి విద్యా, సాంకేతిక సంస్థను తిరుపతి నుంచి తరలించడం వల్ల విద్యార్థులు, యువతకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ భూమన అభినయ్ రెడ్డి రాజకీయ పార్టీలకు అతీతంగా యువత, విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ రెండో గేట్ నుంచి మెయిన్ గేట్ వరకు భారీ నిరసన ర్యాలీ కొనసాగింది. భూమన అభినయ్ రెడ్డితో పాటు ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ శిరీష తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులు, యువత, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నైలెట్‌ను అమరావతికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. తిరుపతి విద్యా కేంద్రంగా మరింత అభివృద్ధి చెందాల్సిన సమయంలో ఇక్కడి నుంచి కీలకమైన విద్యా, సాంకేతిక సంస్థలను తరలించే చర్యలను అడ్డుకోవాలని, నైలెట్ తిరుపతిలోనే కొనసాగిస్తూ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ర్యాలీలో పాల్గొన్న వారు స్పష్టం చేశారు. తిరుపతి నగర అభివృద్ధి, విద్యార్థులు మరియు యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నైలెట్‌ను తిరుపతిలోనే కొనసాగించాలని కోరుతూ నిర్వహించిన ఈ నిరసన ర్యాలీకి విశేష స్పందన లభించింది. రాజకీయాలకు అతీతంగా నగర ప్రజలు, విద్యార్థులు, యువత ఒక్కటై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ద్వారా నైలెట్ తరలింపుపై స్థానికుల్లో ఉన్న వ్యతిరేకతను చాటిచెప్పారు.