ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం

అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ అటకెక్కించారు 

జగ్గయ్యపేట నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట పట్టణంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న “గడపగడపకు ప్రజా పోరుబాట” కార్యక్రమం ఆరో రోజుకు చేరుకుంది. గురువారం జగ్గయ్యపేట పట్టణంలోని 22వ వార్డు కొమ్ముల మైసమ్మ గుడి బజార్, మిట్టగూడెం ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగ్గయ్యపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పూర్తిగా అటకెక్కిందని, సంక్షేమ పథకాలు నీరుగారిపోయాయని తెలిపారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందన్నారు. పట్టణంలోని అనేక వార్డుల్లో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీధిదీపాల సమస్య, తాగునీటి సమస్యతో పాటు కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ సకాలంలో పరిష్కారం లభించడం లేదని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేశారు. పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు తదితర వర్గాల సంక్షేమానికి అప్పటి ప్రభుత్వం అందించిన ప్రాధాన్యతను వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని తన్నీరు నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్, జిల్లా కార్యదర్శి షేక్ జుబేర్, మాజీ కౌన్సిలర్ నీలం నరసింహారావు, నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

Back to Top