విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీలను 34 శాతం రిజర్వేషన్ల పేరుతో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నయవంచన చేస్తోందని వైయస్ఆర్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. గురువారం విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, తైనాల విజయ్ కుమార్, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ మాట్లాడారు. నర్సీపట్నంలో నిర్వహించిన ‘జయహో బీసీ’ సభ కేవలం ఎన్నికల స్టంట్ అని, బీసీలకు నిజమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారత కల్పించింది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనని వారు స్పష్టం చేశారు. కేబినెట్‌లో బీసీలకు ఉపముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా పదవులతో పాటు డీబీటీ ద్వారా రూ. 1.73 లక్షల కోట్లను నేరుగా బీసీల ఖాతాల్లో జమ చేసి ఆదుకున్న చరిత్ర వైయస్ఆర్‌సీపీదేనని నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే... పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం అంటేనే అమలుకాని హామీలిచ్చి మోసగించిన పక్కా దగా పార్టీ. నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్వహించిన బీసీ సభ ఉద్దేశం ఏమిటి? బీసీలకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా మా పార్టీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో మా ప్రభుత్వంలో లేటరైట్ తవ్వకాలపై రాద్దాంతం చేసిన అయ్యన్నపాత్రుడు, గత 16 నెలల్లో 35 లక్షల టన్నుల లేటరైట్ తవ్వి రూ.1,000 కోట్లు దోచుకుంది నిజం కాదా? మరో రూ.1,000 కోట్లు కొల్లగొట్టేందుకే మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ డ్రామాలు ఆడుతున్నారు. అసెంబ్లీలో మా నాయకుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభలో పులి ఎలా గాండ్రిస్తుందో చూపిస్తాం. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 176 తెస్తే, చంద్రబాబు నాయుడే కోర్టుల్లో కేసులు వేయించి 50% సీలింగ్ సాకుతో రద్దు చేయించారు. వైయస్ జగన్ కేబినెట్‌లో 25 మంది మంత్రుల్లో 11 మంది (40%) బీసీలే ఉన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో ఇద్దరు, 11 రాజ్యసభ సీట్లలో 4, 13 మేయర్లలో 9 మంది బీసీలకే ఇచ్చాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేస్తోంది. అధికారంలోకి వచ్చి 27 నెలలవుతున్నా 50 ఏళ్లకే రూ.4,000 పెన్షన్, బీసీ రక్షణ చట్టం, రూ.1.50 లక్షల కోట్ల సబ్ ప్లాన్, రూ.10,000 కోట్ల బీసీ బ్యాంక్, ఆదరణ పరికరాలు ఏమయ్యాయి? నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి రూ.81,000, ఆడబిడ్డ నిధి కింద రూ.40,500 వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం బకాయి పడింది. ఆరు సిలిండర్లకు బదులు ఒక్కటే ఇచ్చి మోసం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. బొడ్డేటి ప్రసాద్, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు: బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డే.. చంద్రబాబుది ముమ్మాటికీ నయవంచనే నర్సీపట్నం సభలో వేదికపై ఉన్న నాయకుల్లో ఒక్కరికైనా తాము బీసీలకు ఇది చేశామని చెప్పుకునే ధైర్యం ఉందా? బీసీలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు అయితే, వెన్నుదన్నుగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. 164 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఒక్క బీసీ నాయకుడిని కూడా డిప్యూటీ సీఎంగా పక్కన కూర్చోబెట్టుకోవడానికి చంద్రబాబు మనసు రాలేదు. జగన్ హయాంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని పెంచారు. 19 మంది ఎమ్మెల్సీలు, నలుగురు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఉపముఖ్యమంత్రులను చేసి రాజ్యాధికారంలో పెద్దపీట వేశారు. ఎలాంటి వివక్ష లేకుండా డీబీటీ ద్వారా రూ.1.73 లక్షల కోట్లను నేరుగా బీసీల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత వైయస్ఆర్‌సీపీదే. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాగానే మళ్లీ ఓట్ల కోసం ‘జైహో బీసీ’ అంటూ వస్తున్నారు. 2024లో మోసపోయిన బీసీలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా కూటమికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. తైనాల విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే: రహస్యాల పుట్టగా మిశ్రా కమిషన్ నివేదిక.. 34% రిజర్వేషన్ల హామీ పచ్చి బూటకం ప్రజలను మోసం చేయడానికే కూటమి ప్రభుత్వం బీసీలను పావులుగా వాడుకుంటోంది. ప్రభుత్వం నియమించిన రంజన్ కుమార్ మిశ్రా కమిషన్ నివేదికను ప్రజల ముందుకు ఎందుకు తీసుకురాలేదు? చట్టసభల్లో ఎందుకు చర్చించలేదు? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న విషయం తెలిసినా, ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 59 శాతం దాటుతుందని తెలిసి కూడా ప్రజలను ఎలా మభ్యపెడతారు? దీనిపై హైకోర్టు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ కింద రూ.1.70 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించి, డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించి బీసీలను బలోపేతం చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి ఇస్తే సరిపోతుందా? పల్లా శ్రీనివాస్‌కు గానీ, గతంలో అచ్చెన్నాయుడికి గానీ డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు? బీసీలు కేవలం మీ పార్టీ చాకిరీకే పరిమితం కావాలా? మీ పక్కన డిప్యూటీ సీఎంగా కూర్చొనే అర్హత లేదా? వైయస్.జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చి నిజమైన గౌరవం కల్పించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి, మిశ్రా కమిషన్ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలి.