స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయమే లక్ష్యం

కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి

కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌

కోడుమూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌, నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన దిశానిర్దేశంతో గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో పెన్షన్లు, డీఎస్సీ, ఎరువుల కొరత, విద్యుత్‌ సమస్యలు, సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో వైఫల్యాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలని డాక్టర్‌ సతీష్‌ కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, యువత, మహిళా విభాగాల గ్రామ కమిటీలను బలోపేతం చేసి ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పార్టీ నాయకత్వం పరిష్కరిస్తుందని కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. అధికారాన్ని ఉపయోగించి నామినేషన్ల దశలో అడ్డంకులు సృష్టించే రాజకీయ కుట్రలను ఐక్యతతో ఎదుర్కోవాలని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే రెండు, మూడు నెలలు కీలకమని, ప్రతి గ్రామంలో పార్టీ అభ్యర్థులను గుర్తించి స్థానిక ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌, కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top