జనసేన, బీజేపీ సిగ్గుపడాలి

 వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి

 డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి

తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డీఎస్సీ స్కామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారని ప్రశ్నించారు. టెట్‌ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ప్రభుత్వం ఒప్పుకుందని, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారని తెలిపారు. జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారని, లంచాలు తీసుకుని స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేశామన్నది కూడా బోగస్‌ అని, అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వడమే పెద్ద స్కామ్‌ అని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారని, దొడ్డిదారిన జీవో నెంబర్‌ 4 తీసుకురావాలని ప్రయత్నించారని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో క్లియరెన్స్‌ పొందిన 814 పోస్టుల్లో పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారని, డీఎస్సీ స్కామ్‌ బయటకు రావడంతో ఆ ప్రయత్నం ఆగిపోయిందని చెప్పారు.

చంద్రబాబు, లోకేశ్‌ వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు దగ్గర పనిచేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా? అని ప్రశ్నించారు. అందుకే డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ కోరుతున్నామని, నిరుద్యోగ యువత తరఫున కోర్టులోనూ పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ‘కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి’ అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపైనా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. లోకేశ్‌, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు.

డీఎస్సీ స్కామ్‌పై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా బీజేపీ, జనసేన మౌనంగా ఉండటంపై కూడా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. తాను అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకూ ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన ఎందుకు స్పందించడం లేదో వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నందుకు, ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పు చేస్తున్నందుకు బీజేపీ, జనసేన సిగ్గుపడాలని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
 

Back to Top