మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ

డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు.. 

ప్రశ్నలకు సమాధానం చెప్పని కూటమి ప్రభుత్వం

 ఆధారాలు బయటపెడితే కేసులు, అరెస్టులతో అణచివేత.. 

ప్రెస్‌మీట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డీఎస్సీ కుంభకోణంపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని, స్కామ్‌ జరిగిందని ఆధారాలు చూపిస్తే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతోందని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలను బయటపెడుతున్న వారిని జైల్లో పెడుతున్నారని, జర్నలిస్టులు వాస్తవాలు వెల్లడిస్తే వారిపైనా తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఎన్నో ప్రశ్నలు సంధించినా చంద్రబాబు, నారా లోకేశ్‌ నుంచి సమాధానం లేదని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ, పర్యవేక్షణను ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. అక్కడే డీఎస్సీ స్కామ్‌కు ద్వారాలు తెరిచారని పేర్కొన్నారు.

ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన నవీన్‌ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని, మెరిట్‌ లిస్ట్‌లో ఫస్ట్‌ ర్యాంకర్‌ పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. సెకండ్‌ లిస్ట్‌లో అతని పేరు ఎందుకు మాయమైందని, అతని డీఎస్సీ లాగిన్‌ ఎందుకు బ్లాక్‌ చేశారని, వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదని నిలదీశారు. కోర్టుకు ఆ ఫస్ట్‌ ర్యాంకర్‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశారని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

స్పోర్ట్స్‌ కోటాలో పరీక్షే లేకుండా 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారని తెలిపారు. అందుకోసం ప్రత్యేక జీవోలు విడుదల చేసి, రిక్రూట్‌మెంట్‌ పూర్తయిన తర్వాత ఆ జీవోలను మార్చేశారని పేర్కొన్నారు. డీఎస్సీ ఉద్యోగాల కోసం జరిగిన బేరసారాలకు సంబంధించిన ఆడియో, వీడియోలు బయటకు వచ్చినా తూతూమంత్రంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. ఇది స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నం కాదా? అని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు.

  
 

Back to Top