మెగా డీఎస్సీలో అక్రమాలు ‘ఖోఖో’ల్లలు! 

ఆడని ఆటతో.. నకిలీ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు 

చిత్తూరు జిల్లాలో వెలుగులోకి స్పోర్ట్స్‌ కోటా బాగోతం

 అమరావతి: క్రీడల్లో ప్రతిభ కనబరిచి కష్టపడి ఆడిన క్రీడాకారులకు అన్యాయం చేసిన బాబు సర్కారు అసలు ఆటల్లో పాల్గొనని వారికి మెగా డీఎస్సీలో ఉద్యోగాలిచ్చేసింది! బంగారు పతకాలు సాధించిన వారిని పక్కనపెట్టి, నకిలీ పార్టీసిపేషన్‌ సర్టిఫికెట్లు తెచ్చిన వారికి కొలువులు కట్టబెట్టింది. మెగా డీఎస్సీ 2025 స్కామ్‌లో మరిన్ని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో నకిలీ ఖోఖో సర్టీఫికెట్‌తో డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం పొందిన ఉదంతం  తీవ్ర కలకలం రేపుతోంది. 

ఆట ఆడలేదు.. అయినా ఉద్యోగం.. 
మెగా డీఎస్సీలో ఎంపికైన పీవీసీహెచ్‌ బసవేశ్వరరావు మార్కాపురం (ఉమ్మడి ప్రకాశం) జిల్లా పుల్లలచెరువు మండలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2015లో కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన 49వ ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ ఇంటర్‌ డి్రసిక్ట్‌ ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు ఆయన డీఎస్సీలో సర్టీఫికెట్‌ సమర్పించాడు. కానీ ఆయన అసలు ఆ పోటీల్లో పాల్గొనలేదు. ఖోఖో ఆటకి, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆ టోర్నమెంట్‌లో ప్రకాశం జిల్లా జట్టుకి 3వ స్థానం లభించింది. మూడో స్థానం సాధించిన 12 మంది సభ్యుల జట్టు దిగిన గ్రూప్‌ ఫొటోలోనూ బసవేశ్వరరావు లేడు. 

అయినా సరే బసవేశ్వరావుకి పార్టీసిపేషన్‌ సర్టిఫికెట్‌ ఎలా వచ్చిందనేది అధికారులకే తెలియాలి. అదేవిధంగా చిల్లా మోహినీదేవి, సి.హెచ్‌. యోగేశ్వరరావు అనే మరో ఇద్దరు అభ్యర్ధులు సమర్పించినట్లు చెబుతున్న క్రీడా ధ్రువపత్రాల ప్రామాణికతపైనా ఖోఖో సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏఏపీ) వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌కు ఓ లేఖ కూడా రాసింది. స్పోర్ట్స్‌ కోటాలో దొడ్డిదారిలో ఉద్యోగాలిచ్చినట్లు ఇప్పటికే అనేక ఉదంతాలు బయటకు రాగా తాజాగా మరో బాగోతం బయట పడింది. 

మావద్ద లేవు.. 
బసవేశ్వరరావు గురించి అప్పటి ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్‌ కార్యదర్శి భవనం కాశీవిశ్వనా«థరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా తమ వద్ద అమ్మాయిల వివరాలు మాత్రమే ఉంటాయని, అబ్బాయిల వివరాలు ఫెడరేషన్‌లో ఉంటాయని చెప్పుకొచ్చారు. నిజానికి రాష్ట్రం తరపున ఆడిన క్రీడాకారుల వివరాలు ఫెడరేషన్‌ వద్ద ఉంటాయి. జిల్లా స్థాయిలో అడిన వారి వివరాలు కార్యదర్శి వద్దనే ఉంటాయి. అంటే కావాలనే విశ్వనాథరెడ్డి తప్పించుకునే యత్నం చేస్తున్నారని స్పష్టం అవుతోంది.  

అడగడానికి మీరెవరు..? 
ఈ అంశంపై వివరణ కోరేందుకు బసవేశ్వరరావును ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించింది. తాను ఖోఖో క్రీడాకారుడినేనని, గుడివాడలో జరిగిన ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొన్నానని బసవేశ్వరరావు చెప్పారు. తాను సమర్పించిన సర్టీఫికెట్‌ నకిలీది కాదన్నారు. ఆడకుండా, ఆడానని చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇంతకుమించి వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ‘నన్ను అడగడానికి మీరెవరు..?’ అంటూ సాక్షి ప్రతినిధిపై తీవ్ర స్వరంతో మండిపడ్డారు.

అతను ఆడలేదని ముందే చెప్పాం..
స్పోర్ట్స్‌ కోటాలో డీఎస్సీలో అర్హత సాధించిన 42 మంది అభ్యర్ధులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌)కు ముందే పంపించాం. అందులో బసవేశ్వరరావుతో పాటు మరి కొందరు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని, వారు ఖోఖో ఆడలేదని, మావద్ద వారికి సంబంధించి ఎలాంటి వివరాలు లేదని స్పష్టంగా చెప్పాం. అయినప్పటికీ వారిలో కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు. బసవేశ్వరరావు సమర్పించిన పార్టీసిపేషన్‌ సర్టీఫికెట్‌ పూర్తిగా నకిలీది. అతను గుడివాడలో జరిగిన ఖోఖో ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొనలేదు. 
– మేకల సీతారామిరెడ్డి,  2012–25 వరకు ఆంధ్రప్రదేశ్‌ ఖోఖో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి 

Back to Top