దేవుడి విగ్రహానికీ పోలీసుల ఆంక్షలా?

వినాయక నిమజ్జనాన్ని అడ్డుకుని వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం దారుణం

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల రమేష్ ధ్వజం

పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల రమేష్

తాడేపల్లి:  ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం మోగులూరు గ్రామంలో వినాయక నిమజ్జనాన్ని పోలీసులు అడ్డుకుని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల రమేష్ మండిపడ్డారు. దేవుడి కార్యక్రమానికే పోలీసుల ఆంక్షలు విధించి, నిమజ్జనానికి వెళ్తున్న వినాయక విగ్రహాన్ని రోడ్డుపై నిలిపివేయడం ఏ తరహా పాలన అని ప్రశ్నించారు. రాజకీయ కక్షల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను వేధిస్తున్నారని, ఇదే సమయంలో నందిగామలో నెలకొన్న కరువు, సాగునీరు, తాగునీటి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేల్పుల రమేష్ మాట్లాడారు.

ప్రెస్‌మీట్‌లో వేల్పుల రమేష్ ఏమన్నారంటే..

- దేవుడి కార్యక్రమాన్నీ అడ్డుకుంటారా?

“కంచికచర్ల మండలం మోగులూరు గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు బండి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు నిమజ్జనం ప్రారంభిస్తే రాత్రి 7 గంటలకే సీఐ, ఎస్‌ఐతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి వచ్చి విగ్రహాన్ని రోడ్డుపై అడ్డుకున్నారు. నిమజ్జనానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి బెదిరించారు. దేవుడి కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో రావడం సిగ్గుచేటు.”

- కేసుల పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై వేధింపులు

“ఇప్పటికే మీపై కేసులు ఉన్నాయని, గతంలో మిమ్మల్ని పోలీస్‌స్టేషన్‌లో ఉంచామని చెబుతూ కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారు. మా మండల పార్టీ అధ్యక్షుడు బండి మల్లికార్జునరావుతో పాటు 13 మంది నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాత్రి 12 గంటల తర్వాత నిమజ్జనం నిర్వహించాల్సిన పరిస్థితిలో కూడా సుమారు 20 మంది పోలీసులు వెంట ఉండటం చూస్తే వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను ఏ స్థాయిలో భయపెడుతున్నారో అర్థమవుతోంది. రాజకీయ కక్షలకు పోలీసులు వంతపాడటం మానుకోవాలి.”

- ప్రజా సమస్యలు గాలికి.. రాజకీయ వేధింపులే పనిగా!

“నందిగామలో కృష్ణా, వైరేరు, మునేరు వంటి నదులు ఉన్నా రైతులకు సాగునీరు అందని పరిస్థితి ఉంది. కరువు తాండవిస్తోంది. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య కూడా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను పట్టించుకోవాల్సిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించడం, పోలీసులతో వేధింపులకు పాల్పడటంపైనే దృష్టి పెట్టారు. కంచికచర్ల సీఐ, ఎస్‌ఐ గుర్తుంచుకోవాలి.. దేవుడి కార్యక్రమాన్ని అడ్డుకోవడం అన్యాయం. ప్రజల కోసం పనిచేసే వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను భయపెట్టడం ఎవరి వల్లా కాదు.”

Back to Top