కూటమి పాలనలో పేదలకు న్యాయం కరువు

  వినుకొండ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
వినుకొండలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధులు, మంజూరైన నిధుల వివరాలతో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రాజకీయ ఆరోపణలు కాకుండా వాస్తవ లెక్కలు ప్రజల ముందుంచాలని అన్నారు.

తమ హయాంలో రోడ్ల విస్తరణ, కొండరాళ్ల తొలగింపు, ఆలయాల పరిసరాల అభివృద్ధి, నిరాశ్రయులకు ప్రత్యామ్నాయ స్థలాల కల్పన వంటి పనులు చేపట్టామని తెలిపారు. ఘాట్ రోడ్డు నిర్మాణంలో సొంత యంత్రాలతో పనులు పూర్తి చేశామని, ప్రభుత్వ నిధుల నుంచి ఒక్క రూపాయి బిల్లు తీసుకున్నట్లు నిరూపిస్తే ఆధారాలు బయటపెట్టాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు సవాల్ చేశారు. పెన్షన్లు, ఇళ్ల పథకాలు తదితర సంక్షేమ పథకాల విషయంలో పేదలకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ నిధుల వినియోగం, రోడ్లు, లేఅవుట్లు, మౌలిక వసతులపై పూర్తి పారదర్శకత పాటించాలని అన్నారు.

వినుకొండలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారని బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. రాజకీయ కక్షసాధింపులకు తావులేకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, పేదల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
 

Back to Top