షార్లెట్‌లో మారుమోగిన రాజన్న నామస్మరణ

వైయ‌స్‌ఆర్‌ 17వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు

పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైయ‌స్‌ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు, ఎన్నారైలు

 అమెరికా: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని నార్త్‌ కరోలినా రాష్ట్రం షార్లెట్‌ నగరంలో వైయ‌స్‌ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. వైయ‌స్‌ఆర్‌ ప్రజా సేవ, సంక్షేమ పాలనను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎన్నారైలు, పార్టీ నాయకులు, అభిమానులు హాజరయ్యారు.

కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైయ‌స్‌ఆర్‌సీపీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ చల్లా మధుసూదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహానేత వైయ‌స్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయ‌స్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పేద ప్రజలకు చేసిన సేవలు నేటికీ తెలుగు ప్రజల మనసుల్లో సజీవంగా ఉన్నాయని గుర్తుచేశారు. మహానేత ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు పార్టీ పటిష్టతకు ఎన్నారైలు నిరంతరం సహకరించాలని కోరారు.

వైయ‌స్‌ఆర్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవితాల్లో కీలక మార్పులు తీసుకొచ్చాయని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేశారు. మహానేత వైయ‌స్‌ఆర్‌ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు, ఎన్నారైలు ప్రతిజ్ఞ చేశారు.

వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకుడు రత్నాకర్‌ పాండుగాయల మాట్లాడుతూ.. వైయ‌స్‌ఆర్‌ విశ్వసనీయత, నాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడిగా వైయ‌స్‌ఆర్‌ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. వైయ‌స్‌ఆర్‌ నాయకత్వంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని గుర్తుచేశారు. మహానేత ఆశయాలు, ప్రజా సంక్షేమ విధానాలను కొనసాగించడంలో వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాత్రను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడటమే తమ లక్ష్యమని రత్నాకర్‌ పాండుగాయల పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు రాధాకృష్ణరెడ్డి, సబ్బాసాని రంగారెడ్డి, సంజీవరెడ్డి, మేక సుబ్బారెడ్డి, కోటిరెడ్డి, కిషోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురు పార్టీ ప్రతినిధులు, వైయ‌స్‌ఆర్‌ అభిమానులు, ఎన్నారైలు పాల్గొని మహానేతతో తమకున్న అనుబంధాన్ని, ఆయన ప్రజా సేవను స్మరించుకున్నారు. మహానేత వైయ‌స్‌ఆర్‌ భౌతికంగా దూరమై 17 ఏళ్లు గడిచినా ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సేవా స్ఫూర్తి ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు గుర్తుచేసుకున్నారు.
 

Back to Top