తాడేపల్లి: రాష్ట్రంలో జరిగిన భారీ డీఎస్సీ కుంభకోణం నుంచి మంత్రి నారా లోకేష్‌ను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దారుణంగా బరితెగించిందని వైయస్ఆర్‌సీపీ లీగల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని ప్రశ్నించిన తమ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ట్వీట్లను తొలగించేందుకు ఏకంగా గుంటూరు పోలీసులు అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ 'ఎఫ్‌బీఐ' పేరును దుర్వినియోగం చేస్తూ 'ఎక్స్' సంస్థకు మెయిల్స్ పంపడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులను అడ్డం పెట్టుకుని అంతర్జాతీయ స్థాయి సంస్థల పేర్లతో తప్పుడు డిసిగ్నేషన్లు క్లెయిమ్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసుల వ్యవహారశైలిపై డీజీపీ తక్షణమే సమాధానం చెప్పాలని, ఈ కుట్రలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేస్తామని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... డీఎస్సీ స్కామ్‌ను కప్పిపుచ్చేందుకే కుట్రలు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ డీఎస్సీలో భారీ అవినీతికి పాల్పడింది. బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు అమ్ముకున్న వ్యవహారం ఆధారాలతో సహా బయటపడుతుంటే ప్రభుత్వం సహించలేకపోతోంది. ప్రశ్నించే గొంతుకలను మూయించడానికి మీడియా యాజమాన్యాలను బెదిరించడం, సోషల్ మీడియా పోస్టులను బలవంతంగా తొలగించడం వంటి నిరంకుశ చర్యలకు పాల్పడుతున్నారు. లోకేష్ రాజీనామా డిమాండ్ తప్పా?.. డీఎస్సీ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఏపీలో మరో జెన్ జీ ఉద్యమం మొదలవబోతుందని... డిఎస్సీ అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు పై యువత రోడ్డుపైకి వచ్చే సమయం వచ్చింది. విద్యాశాఖ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ ను కేబినెట్ నుంచి తొలగించాలని... మా పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ప్రజాస్వామ్యబద్ధంగా మూడు ట్వీట్లు చేశారు. అందులో ఎలాంటి అశ్లీలత గానీ అసత్యాలు గానీ లేవు. నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహించినప్పుడు రాష్ట్రంలో లోకేష్ ఎందుకు రాజీనామా చేయకూడదని అడగడం తప్పా? దీనికే ప్రభుత్వం ఇంతలా వణికిపోవాలా?. ఎఫ్‌బీఐ పేరుతో ఏపీ పోలీసుల దగా.. నాగార్జున యాదవ్ పోస్టులను తొలగించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అధికారిక మెయిల్ ఐడీ ద్వారా ఒక సీఐ స్థాయి అధికారి ఎక్స్ సంస్థకు లేఖ రాశారు. అందులో తన ఆర్గనైజేషన్ పేరును అమెరికాకు చెందిన 'ఎఫ్‌బీఐ'గా పేర్కొన్నారు. మొదట ఎఫ్‌బీఐ ఫిర్యాదు మేరకే నోటీసు పంపామని చెప్పిన ఎక్స్ సంస్థ, నాగార్జున యాదవ్ ఆధారాలు అడిగేసరికి అసలు నిజాలు బయటపెట్టింది. ఆ ఫిర్యాదు అమెరికా ఎఫ్‌బీఐ నుంచి రాలేదని, ఏపీ పోలీసులే ఆ పేరును ఉపయోగించారని ఎక్స్ స్వయంగా లిఖితపూర్వకంగా స్పష్టం చేసింది. పోలీసుల ఖ్యాతిని అంతర్జాతీయంగా దిగజార్చారు. చంద్రబాబు తన కొడుకును రక్షించుకోవడానికి ఏపీ పోలీసు వ్యవస్థ పరువును విదేశాల్లో కూడా బజారున పడేశారు. ఏపీ రాజకీయాలకు, అమెరికా ఎఫ్‌బీఐకి ఏం సంబంధం? ఎఫ్‌బీఐ అంటే 'ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్' తప్ప 'ఫేక్ బాబు ఇన్వెస్టిగేషన్' కాదు. గుంటూరు అర్బన్ ఎస్పీ అధికారిక మెయిల్ నుంచి సీఐ బ్రహ్మయ్య ఎఫ్‌బీఐ పేరుతో మెయిల్ పెట్టడం వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? దీనిపై డీజీపీ, చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం.. ఈ నేపధ్యంలో రాజకీయ కక్షసాధింపులకు సీఐడీ, సిట్‌లను వాడుకున్నట్టే ఇప్పుడు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల పేర్లను కూడా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వాడుకోవడంపై మనోహర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రశ్నించే హక్కును కాలరాస్తూ.. మరోవైపు రాజ్యాంగ వ్యతిరేక పనులకు పాల్పడుతున్న ఈ ఉదంతాన్ని వైయస్ఆర్‌సీపీ ఇంతటితో వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ఈ దురాగతంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులైన వారిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.