వార్డుల పునర్విభజనలో తీవ్ర‌మైన లోపాలు

ఎస్‌ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ 

భౌగోళిక నిబంధనలు పాటించకుండా ఓటర్లను వేర్వేరు వార్డులకు విభజన

ప్రసన్నాయపల్లి, తెనాలి మున్సిపాలిటీల్లోని అవకతవకలపై స్పష్టమైన ఆధారాలు

వార్డుల పునర్విభజనపై సమగ్ర సమీక్ష జరిపి లోపాలను సరిదిద్దాలని డిమాండ్

సవరించిన వార్డు మ్యాప్‌లు, ఓటర్ల జాబితాలను ప్రజల పరిశీలన కోసం ప్రచురించాలి

అభ్యంతరాలు పరిష్కారమయ్యే వరకు తుది ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి

తాడేపల్లి:  రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న వార్డుల పునర్విభజన ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. వార్డుల సరిహద్దుల ఖరారులో గుర్తింపు పొందిన కాలనీలు, సహజ సరిహద్దులు, డోర్ నంబర్ల వరుస క్రమాన్ని తగిన విధంగా పరిగణనలోకి తీసుకోలేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆయన లేఖ రాశారు. వివిధ ప్రాంతాల నుంచి తమకు అందిన ఫిర్యాదుల ప్రకారం.. ఒకే వీధి, కాలనీ లేదా నివాస ప్రాంతానికి చెందిన ఓటర్లను వేర్వేరు వార్డుల్లోకి విభజించారని లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో భౌగోళికంగా దూరంగా ఉన్న, పరస్పర సంబంధం లేని ప్రాంతాలను ఒకే వార్డులో కలిపినట్లు తెలిపారు. దీనివల్ల ఓటర్లకు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గందరగోళం, అసౌకర్యం ఏర్పడే పరిస్థితి ఉందని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. లేఖ‌తోపాటు ప్రసన్నాయపల్లి గ్రామ‌ పంచాయ‌తీ, తెనాలి మున్సిపాలిటీల్లో వార్డుల పున‌ర్విభ‌జ‌న‌లో జ‌రిగిన అవకతవకలను ఆధారాల‌తో స‌హా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కి స‌మ‌ర్పించారు. 

వార్డుల స‌రిహ‌ద్దులు సౌక‌ర్య‌వంతంగా ఉండాలి 

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీని 2026 ఓటర్ల జాబితా ప్రకారం 14 వార్డులుగా విభజించారని అప్పిరెడ్డి తెలిపారు. అయితే ఒకే ప్రాంతానికి, ఒకే కుటుంబాలకు చెందిన ఓటర్లను వేర్వేరు వార్డుల్లోకి చెల్లాచెదురు చేశారని ఆరోపించారు. కొన్ని వార్డులు గ్రామంలోని వేర్వేరు ప్రాంతాలను కలిపి కవర్ చేస్తున్నాయని, దీనివల్ల స్థానికంగా గందరగోళం నెలకొంటోందని లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు తెనాలి మున్సిపాలిటీలోనూ ఇదే తరహా సమస్యలు ఉన్నాయని అప్పిరెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 14న జారీ చేసిన ప్రొసీడింగ్స్ ద్వారా వార్డుల సంఖ్యను 40 నుంచి 52కి పెంచారని పేర్కొన్నారు. ముఖ్యంగా 28, 30, 35, 42, 52వ వార్డుల్లో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ఒకే చిరునామాలో లేదా ఒకే ప్రాంతంలో నివసిస్తున్న ఓటర్లను వేర్వేరు వార్డుల్లో చేర్చినట్లు లేఖలో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదులను కేవలం విడివిడిగా జరిగిన క్లరికల్ పొరపాట్లుగా పరిగణించరాదని, ఇవి విస్తృతమైన సమస్యకు సంకేతాలని అప్పిరెడ్డి పేర్కొన్నారు. వార్డుల సరిహద్దులు స్పష్టంగా, భౌగోళికంగా, సులభంగా గుర్తించదగినవిగా, ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నారు.

భౌగోళిక ప్రాతిప‌దిక ప్ర‌కారం విభ‌జ‌న జ‌ర‌గాలి 

వైఎస్సార్సీపీ తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలు సూచనలు చేశారు. వార్డుల పునర్విభజనపై సమగ్ర రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించాలని, ఒకే భౌగోళిక యూనిట్‌కు చెందిన ఓటర్లను సంబంధిత వార్డులోనే ఉంచాలని కోరారు. సరైన భౌగోళిక ప్రాతిపదిక లేకుండా వేర్వేరు ప్రాంతాలను ఒకే వార్డులో కలపకూడదని విజ్ఞప్తి చేశారు. అలాగే కమిషన్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అందిన అభ్యంతరాలను నిష్పక్షపాతంగా పరిశీలించి లోపాలను సరిదిద్దాలని కోరారు. సవరించిన వార్డు మ్యాప్‌లు, ఓటర్ల జాబితాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని, అభ్యంతరాలు పరిష్కారం కాని ప్రాంతాల్లో తుది ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన వార్డుల పునర్విభజన ప్రక్రియను నిర్ధారించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి తన లేఖలో కోరారు.

Back to Top