ఎఫ్‌బీఐ పేరుతో ఏపీ పోలీసుల ఫేక్‌ నోటీసులు

వాటిపై విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేస్తాం

వై.నాగార్జునయాదవ్‌ వెల్లడి

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్‌.

ఏ చట్టం ప్రకారం ఎఫ్‌బీఐ పేరు ఉపయోగించారు?

దీనికి రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలి

ఈ వ్యవహారం ఏపీ పోలీసుల ప్రతిష్టను దిగజార్చింది

ఇది భావ ప్రకటన, వ్యక్తిగత సేచ్ఛ హక్కులకూ విఘాతం

చంద్రబాబు, లోకేశ్‌ దిగజారుడుతనానికి పరాకాష్ట

ప్రెస్‌మీట్‌లో నాగార్జునయాదవ్‌ స్పష్టీకరణ

 తాడేపల్లి:     ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల వైఫల్యాలను, లోపాలను ఎత్తిచూపే పౌర వ్యవస్థలపై రాష్ట్రంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా నిరంకుశత్వ చర్యలతో వేధింపులకు గురి చేస్తోందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కులకు విఘాతం కలిగించేలా అమలు చేస్తున్న ప్రభుత్వ  విధానాలను ప్రశ్నించే జర్నలిస్టులు, పౌరులు, సోషల్‌ మీడియా ప్రభావితులను నేరస్తులుగా చూడటం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల గుంటూరు జిల్లాలో ఓ మహిళపై దాడి చేసి వివస్త్రను చేసిన ఘటనను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టులు చేసిన  ప్రఖ్యాత జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్, జుబైర్‌ వంటి వారితో పాటుగా సోషల్‌ మీడియాలలో పోస్టులు చేసిన పలువురికి అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ‘ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’ (ఎఫ్‌బీఐ) పేరుతో గుంటూరు పోలీసులు ఫేక్‌ నోటీసులు పంపించడం చంద్రబాబు ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శమని ఆక్షేపించారు.
    రాష్ట్రంతో పాటుగా దేశానికి తలవంపులు తెచ్చేలా రాష్ట్ర పోలీసులు సాగించిన అక్రమ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని నాగార్జునయాదవ్‌ వెల్లడించారు. ఆ మేరకు వైయస్సార్‌సీపీ ఎంపీలు  విదేశాంగ మంత్రిత్వ శాఖకు, కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగంతో పాటు, పలు శాఖలకు ఫిర్యాదు చేస్తారని తెలిపారు. భారతదేశ పౌరులపై విదేశీ సంస్థలకు పంపినట్లు చెబుతున్న లేఖల విషయంలో పూర్తి వివరాలను రాష్ట్ర డీజీపీ ప్రజల ముందుంచాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగార్జునయాదవ్‌ స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో నాగార్జునయాదవ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

ప్రశ్నించడం నేరమా?:
    రాష్ట్రంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, సోషల్‌ మీడియా కార్యకర్తలు, స్వతంత్ర జర్నలిస్టులు, సోషల్‌ మీడియా ప్రభావితులను టార్గెట్‌ చేసింది.  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్న  ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా? ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం నేరమా?. గుంటూరులో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వార్తలను ప్రచురించిన జర్నలిస్టులకు ఎక్స్‌ సంస్థ ద్వారా నోటీసులు వచ్చాయి. ఈ  వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ స్పష్టమైన వివరణ ఇవ్వాలి. పోలీసులు పంపిన లేఖల్లో తమను తాము ఎఫ్‌బీఐ ప్రతినిధులుగా పేర్కొన్నారనే అంశంపై కూడా దేశ, రాష్ట్ర ప్రజలకు డీజీపీ సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఏ చట్టం ప్రకారం ఎఫ్‌బీఐ  పేరును ఉపయోగించారు? ఆ లేఖలు ఎవరి ఆదేశాలతో పంపించారో వెల్లడించాలి. 
    ఒకవేళ ఆ పోస్టులపై కేసులు నమోదై ఉంటే, ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ ఏమిటి? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? పోస్టుల్లో ఏ అంశం చట్టాన్ని ఉల్లంఘించింది? సోషల్‌ మీడియా ఖాతాలపై చర్యలకు ఏ చట్టపరమైన ఆధారం ఉంది? పోస్టులను తొలగించాలని ఏదైనా కోర్టు ఆదేశించిందా? వంటి అన్ని వివరాలను  ప్రజల ముందుంచాలి. చట్టాన్ని అమలు చేసే అధికారులు కూడా రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. డీజీపీ అయినా, ఎస్పీ అయినా, డీఎస్పీ అయినా, ఏ స్థాయి అధికారి అయినా చట్టానికి అతీతులు కాదని గుర్తు పెట్టుకోవాలి.

గీత దాటితే చట్టం ముందు నిలబెడతాం:
    చంద్రబాబునాయుడి వెన్నుపోటు ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగించాలి. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలి. జర్నలిస్టులు, సోషల్‌ మీడియా ప్రభావితులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే పౌరులపై వేధింపులు లేకుండా పారదర్శకమైన పాలన అందించాలి. డీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వంటి అంశాలపై యువతకు ఉన్న సందేహాలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాల్సిందే.  ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడం పరిష్కారం కాదని గ్రహించాలి. 
    పోలీసు వ్యవస్థ అంటే సీఎం చంద్రబాబు, లోకేశ్‌ చెప్పినట్లు వారికి ఊడిగం చేస్తూ పని చేయరాదు. జర్నలిస్టులు, సోషల్‌ మీడియా ప్రభావితులను వేధించే చర్యల విషయంలో  ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ పని చేస్తున్న అధికారులు సిబ్బందిని రాబోయే రోజుల్లో చట్టం  ముందు దోషులుగా నిలబెడతామని నాగార్జునయాదవ్‌ హెచ్చరించారు.

Back to Top