టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల ఘనత వైయ‌స్ జగన్‌ ప్రభుత్వానిదే

2023లోనే స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశాం: భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో 2023లోనే అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టి పట్టాలు పంపిణీ చేసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియ గతంలోనే ప్రారంభమైందని, అయితే కోర్టు వ్యాజ్యాల కారణంగా కొంతకాలం నిలిచిపోయిందని చెప్పారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రక్రియను తిరిగి ముందుకు తీసుకెళ్లి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి టీటీడీ ఉద్యోగులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, నిబంధనల కారణంగా ఉచితంగా కేటాయించడం సాధ్యం కాకపోవడంతో నామమాత్రపు ధరకు స్థలాలు అందించే విధంగా ప్రక్రియ పూర్తి చేసినట్లు భూమన వివరించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం సుమారు 1,200 ఎకరాల భూమిని సిద్ధం చేసి, పట్టాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేశామని చెప్పారు.

ఇటీవల టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి ₹230 కోట్ల ప్రణాళికను టీటీడీ ఆమోదించినట్లు వార్తలు వెలువడ్డాయి. 5,192 మంది ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద మౌలిక వసతుల పనులు చేపట్టే అంశం ఇందులో ఉంది. టీటీడీలో శాశ్వత ఉద్యోగాల అంశంపైనా భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. ఉద్యోగులకు భద్రత, స్థిరత్వం కల్పించే అంశాన్ని ప్రభుత్వం, టీటీడీ యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. రాయలసీమ, తిరుపతి ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంలో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించే విధానాన్ని అమలు చేస్తామని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. 

Back to Top