భారీ గాలులు, వర్షానికి నేలకొరిగిన అరటి పంట

 సనపలో 100 ఎకరాల్లో పంట నష్టం.. రైతులను వెంటనే ఆదుకోవాలి: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

అనంతపురం జిల్లా: ఆత్మకూరు మండలం సనప గ్రామంలో గత రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. సుమారు 100 ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరగడంతో రైతులు భారీగా నష్టపోయారు.
పంట నష్టం విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సనప గ్రామానికి వెళ్లి దెబ్బతిన్న అరటి తోటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి, వర్షం, గాలుల కారణంగా జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. భారీ గాలుల ధాటికి అరటి చెట్లు పూర్తిగా నేలమట్టం కావడంతో పంట చేతికందే సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్క ఎకరానికి సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని, అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా స్పందించాలని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు అవసరమైన సహాయం అందించి అండగా నిలవాలని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కోరారు. 

Back to Top