అనంతపురం: రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీకి వినతిపత్రం సమర్పించారు. మైనార్టీల సంక్షేమం, భద్రత, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. మైనార్టీలకు ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందని, వారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి ప్రభుత్వానికి బలమైన సిఫార్సులు చేయాలని కమిటీని కోరారు. మైనార్టీ ఆడబిడ్డల వివాహానికి రూ.లక్ష సాయం మైనార్టీ ఆడబిడ్డల వివాహానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. పేద ముస్లిం కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మసీదులు, ఈద్గాలు, స్మశానవాటికలకు మౌలిక వసతులు మసీదుల అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు ఈద్గా స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్లిం స్మశానవాటికలకు కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఇమామ్‌లు, మౌజమ్‌ల గౌరవ వేతనాలను పెంచాల్సిన అవసరాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. 50 ఏళ్లకే పింఛన్ హామీ అమలు చేయాలి ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. వృద్ధాప్యానికి ముందే ఆర్థిక భరోసా కల్పించే ఈ హామీని అమలు చేయడం ద్వారా మైనార్టీ కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. నూర్‌బాషా కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు నూర్‌బాషా కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల నిధులు కేటాయించి, ఆ వర్గం సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉర్దూ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం 25 శాతం ముస్లిం విద్యార్థులు ఉన్న తెలుగు ఉన్నత పాఠశాలల్లో ఉర్దూ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ప్రతి మండలానికి ఒక ఉర్దూ ప్రాథమిక పాఠశాలను ఉన్నత ప్రాథమిక పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలని, ఉర్దూ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మదరసాల ఆధునికీకరణ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడంతో పాటు ముద్రా, పీఎంఈజీపీ, వడ్డీలేని రుణాల ద్వారా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంచాలని సూచించారు. ప్రభుత్వానికి బలమైన సిఫార్సులు చేయాలి మైనార్టీల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, వారికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన సిఫార్సులు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ జనాబ్ మొహమ్మద్ నసీర్ అహ్మద్ సాహెబ్, సభ్యులను వైయస్ఆర్‌సీపీ తరఫున కోరారు.