శ్రీకాకుళం : విశ్వకర్మలు కేవలం ఒక వృత్తికి చెందినవారు కాదని, తరతరాలుగా తమ నైపుణ్యం, శ్రమతో సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తొలి ఇంజనీర్లని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయం (టౌన్‌హాల్)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. విశ్వకర్మ జయంతి కేవలం ఒక వర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని, భారతదేశ నాగరికత, పూర్వీకులు సాధించిన విజ్ఞానం, తరతరాలుగా సమాజానికి సేవలందించిన వృత్తుల నైపుణ్యాన్ని గుర్తుచేసుకునే సందర్భమని తెలిపారు. పంచబ్రహ్మలుగా చెప్పబడే ఐదు ప్రధాన వృత్తి సంప్రదాయాలు సమాజ నిర్మాణానికి ఎంతో అవసరమైనవని పేర్కొన్నారు. మనుబ్రహ్మ కమ్మరి వృత్తికి, మయబ్రహ్మ వడ్రంగి వృత్తికి, త్వష్టబ్రహ్మ స్వర్ణకార వృత్తికి, శిల్పిబ్రహ్మ రాతి శిల్పకళకు ప్రతీకలుగా నిలిచారని, దైవజ్ఞబ్రహ్మ కూడా ఈ సంప్రదాయంలో ముఖ్యమైన భాగమని వివరించారు. వ్యవసాయ పనిముట్ల నుంచి గృహ నిర్మాణం వరకు, పండుగల నుంచి రోజువారీ అవసరాల వరకు విశ్వకర్మ కుటుంబాలు తమ చేతులతో ఎన్నో వస్తువులను తయారు చేస్తూ సమాజానికి సేవలందించాయని చెప్పారు. వారి నైపుణ్యం కేవలం ఒక ఉద్యోగం కాదని, తరతరాల అనుభవం, పరిశీలన, సాధన ద్వారా అభివృద్ధి చెందిన జీవన విజ్ఞానమని పేర్కొన్నారు. ఆధునిక యాంత్రిక విజ్ఞానం అభివృద్ధి చెందడంతో సంప్రదాయ చేతివృత్తులు క్రమంగా వెనుకబడుతున్నాయని, వాటిపై ఆధారపడిన కుటుంబాల జీవన విధానంలోనూ మార్పులు వచ్చాయని తెలిపారు. సంప్రదాయ వృత్తులు కాలానుగుణంగా అభివృద్ధి చెందేందుకు ఆధునిక శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవకాశాలు, ఆర్థిక సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వకర్మల నైపుణ్యం దేశ నాగరికతలో భాగమని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మన పురాణాలు, ఇతిహాస సంప్రదాయాల్లో విశ్వకర్మకు ప్రత్యేక స్థానం ఉందని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. లంక, ద్వారక, ఇంద్రప్రస్థంలోని మయసభ వంటి నిర్మాణాలతో విశ్వకర్మ, శిల్ప సంప్రదాయాలను అనుసంధానిస్తూ పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు ప్రధాన విగ్రహాన్ని తాకే విధానం వెనుక ఉన్న నిర్మాణ జ్ఞానం, గణన, వాస్తు, ఖగోళ పరిశీలన పూర్వీకుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. ఈరోజు సివిల్ ఇంజనీరింగ్, నిర్మాణ సాంకేతికత వంటి పేర్లతో పిలుస్తున్న అనేక అంశాలకు మూలాలను మన పురాతన శిల్ప, నిర్మాణ సంప్రదాయాల్లో చూడవచ్చని తెలిపారు. విశ్వకర్మలను కేవలం ఒక వృత్తికి చెందినవారిగా కాకుండా, వారి వెనుక ఉన్న జ్ఞానం, నైపుణ్యం, శ్రమను గౌరవించాలని సూచించారు. రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల్లో పోటీ చేసే సంస్థలు మాత్రమే కాకుండా.. సమాజంలోని వివిధ వర్గాలు, వృత్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిపై చైతన్యం తీసుకువచ్చి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. విశ్వకర్మల వృత్తులు అభివృద్ధి చెందాలని, వారి పిల్లలకు మంచి విద్య, ఆధునిక నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. సంప్రదాయ వృత్తికి ఆధునిక సాంకేతికత తోడైతే ఈ నైపుణ్యం మరింత ముందుకు సాగుతుందని తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సమాజ నిర్మాణంలో తరతరాలుగా తమ వంతు పాత్ర పోషించిన ప్రతి విశ్వకర్మ కుటుంబానికి ధర్మాన ప్రసాదరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.