తాడేపల్లి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాల పేరుతో కూటమి ప్రభుత్వం మోసపూరిత రాజకీయాలకు తెరలేపిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేదలకు గజం ఇంటి స్థలం కూడా ఇచ్చిన దాఖలాలు లేవని అలాంటిది ఇప్పుడు ఆరు నెలల్లో 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పేదవాడికి ఇల్లు ఇవ్వాల్సింది పోయి, వారి నెత్తిన అప్పుల గుదిబండ పెట్టారని ఎద్దేవా చేశారు. ఇల్లు లేని పేదవాడి దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసి, మళ్లీ రుణాలు కట్టమంటే పేదవాడికి ప్రభుత్వం ఏం మేలు చేసినట్టని ప్రశ్నించారు. 2014-19 మధ్య 5 లక్షల టిడ్కో ఇళ్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు చివరకు 3.15 లక్షల ఇళ్లకే శ్రీకారం చుట్టారని, దాదాపు 2 లక్షల యూనిట్ల నిర్మాణం పేరుతో రూ.8,929 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... టిడ్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు దోపిడీ గతంలో 2014-19 మధ్య సీఎంగా చేసిన చంద్రబాబు పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి, టిడ్కో ఇళ్ల పేరుతో లబ్ధిదారులపై అప్పట్లోనే భారీగా భారం మోపాడు. 300 చదరపు అడుగుల ఇల్లు కేటాయించి పేదల నుంచి లక్షల్లో వసూలు చేయడంతోపాటు, వారిపై బ్యాంకు రుణాలు పేరుతో 20 సంవత్సరాలు కట్టించుకునేలా చేశారు. ఒక్కో ఇల్లు ఖరీదును విపరీతంగా పెంచేసి, పేదల నెత్తిపై గుదిబండ మోపారే తప్ప నిజంగా మేలు చేసింది శూన్యం. చంద్రబాబు హయాంలో పేదలకు నామమాత్రపు లబ్ధి కూడా దక్కకపోగా, కేవలం దోపిడీనే లక్ష్యంగా సాగింది. కానీ, వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరిగింది. ఇదే టిడ్కో ఇళ్ల విషయంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం పేదలపై ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు తీసుకుంది. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. దాదాపు 1.43 లక్షల ఇళ్లను ఒక్క రూపాయికే కేటాయించాం. 365 చదరపు అడుగుల ఇళ్లకు రూ.25 వేలు, 435 చదరపు అడుగుల ఇళ్లకు రూ.50 వేలు మాత్రమే లబ్ధిదారుల వాటాగా తీసుకున్నాం. పేదవాడికి ఇల్లు ఇవ్వడం అంటే అప్పుల భారం మోపడం కాదు.. సొంతింటి కలను నెరవేర్చడం అని జగన్ గారు నిరూపించారు. రాజధానిలో పేదలకు ఇళ్లు కేటాయించిన వైయస్ జగన్ ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17,500 లేఅవుట్లు వేసి, ఇళ్లు మంజూరు చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి, పెద్ద సంఖ్యలో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే చర్యలు చేపట్టారు. అమరావతిలో కూడా పేదలకు స్థానం ఉండాలనే ఉద్దేశంతో R5 జోన్ ఏర్పాటు చేసి, సీఆర్డీఏ పరిధిలో సుమారు 50,793 ఇళ్ల పట్టాలను 1,400 ఎకరాల్లో కేటాయించారు. చంద్రబాబు గారు అమరావతిని దేవతల రాజధాని అంటున్నారు. కానీ పేదవాడికి అక్కడ స్థానం కల్పించే విషయంలో ఆయన ప్రభుత్వం ఏం చేస్తోంది? జగన్ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో పేదలకు అన్యాయం చేస్తూ ఇళ్ల పట్టాలను రద్దు చేసింది. జగన్ గారి ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అర్హులైన పేదలకు కేటాయించిన స్థలాలను వెనక్కి తీసుకోవడం సరికాదు. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లకు, ఇతర ఇళ్లకు రంగులు మార్చి తామే నిర్మించినట్టు ప్రచారం చేసుకోవడం మానుకోవాలి. ఇప్పుడు ఆరు నెలల్లో 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు గారు పూర్తి వివరాలు, కార్యాచరణ ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలి. పేదవాడికి ఇల్లు, ఇళ్ల స్థలం అందేలా చూడడమే నిజమైన రియల్ టైమ్ గవర్నెన్స్ అని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.